నకిరేకల్, జనవరి 4 : నకిరేకల్ పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. పట్టణంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మిస్తుండగా, పట్టణ శివారులోని కాలంవారి కుంట కట్టపై మినీ ట్యాంకు బండ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కట్టపై రూ.4.50 కోట్లతో హైమాస్ట్ లైట్లు, పార్క్, కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా 40 వేలకు పైగా జనాభా ఉంది. నియోజకవర్గ కేంద్రం కావడంతో చుట్టు పక్కల మండలాల నుంచి వచ్చి చాలా మంది నకిరేకల్ లో స్థిరపడడంతో జనాభా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో నకిరేకల్ పట్టణ రోడ ్లవిస్తరణ అనివార్యమైంది. నకిరేకల్ బైపాస్‌లోని పద్మానగర్ జంక్షన్ నుంచి ఇనుపాముల జంక్షన్ వరకూ రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. వాటితో పాటు మినీట్యాంక్ బండ్ పనులు చకాచకా సాగుతున్నాయి.
పట్టణ సుందరీకరణలో భాగంగా నిజాం కాలం నాటి వందేండ్ల చరిత్ర ఉన్న కాలంవారి కుంటకు మహర్దశ పట్టనుంది. నకిరేకల్ పట్టణ మున్సిపాలి టీ పరిధిలో కాలంవారి కుంట ఇటు కడపర్తి రోడ్డు(మార్కెట్‌రోడ్డు)కు, అటు మూసీ రోడ్డుకు కట్ట మధ్యలో ఉంటుంది. జనావాసాల మధ్యనున్న కుంటను మినీ ట్యాంక్ బండ్‌గా మార్చాలని పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఎమ్మెల్యే చిరుమర్తి చొరవ4.50 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా తొలివిడుతగా రూ.75 లక్షలు మంజూరయ్యాయి. వాటితో మొదటగా కట్ట విస్తరణ పను లు మొదలు పెట్టారు. మొదటగా కట్ట విస్తరణ పనులు చేపడుతున్నారు. మిగిలిన నిధులు మంజూరుగానే కట్టపై హైమాస్ట్ లైట్లు, పార్క్, పట్టణ ప్రజలు కుంట చుట్టూ వాకింగ్ చేసేలా వాకింగ్ ట్రాక్ లాంటి పనులు చేపట్టనున్నారు.
నకిరేకల్ పట్టణాన్ని మోడల్ సిటీగా మారుస్తాం. పట్టణసుందరీకరణలో భాగంగా నిజాం కాలం నాటి కాలంవారి కుంటను మినీట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతున్నాం. మినీట్యాంక్ బండ్ నిర్మాణానికి రూ.4.50 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. తొలివిడుతగా రూ.75 లక్షలు మంజూరైంది. వాటితో కట్ట విస్తరణ పనులు మొదలయ్యాయి. మిగిలిన నిధులు మంజూరు కాగానే కట్టపై లైటింగ్ నిర్మాణం, కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్, పార్క్ వంటి నిర్మాణాలు చేపట్టి కాలంవారి కుంటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.
– చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్యే