కొల్లాపూర్, సెప్టెంబర్ 15 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం డెడ్‌స్టోరేజీ పాయింట్ కోతిగుండు వద్ద వరదను లిఫ్ట్ చేసేలా రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద 145 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన బాహుబలి మోటర్లతో రెండు టీఎంసీలు ఎత్తిపోశారు. 90 శాతం పనులన్నీ పూర్తి కావడంతో 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ పంప్‌హౌస్‌లో తొలి భారీ పంప్‌ను కేసీఆర్ ప్రారంభించి, పాలమూరు నేలపై కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి 2 టీఎంసీలు ఎత్తిపోశారు. పనులు చూసిన రైతులు కృష్ణమ్మకు పూజలు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పీఆర్ఎల్ఐ పనుల్లో వేగం మందగించింది. మూడేైండ్లెనా పనులు పూర్తి చేయకుండా 270 టీఎంసీలను ఏపీకి అప్పగించిందని నిపుణులు పేర్కొంటున్నారు.
పాలమూరు ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరుతోపాటు రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్న సాగునీటి కలకు ప్రతిరూపంగా నిర్మించారు. శ్రీశైలం జలాశయం నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేలా పథకాన్ని రూపొందించారు. రోజుకు సగటున 1.5 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ప్రాజెక్టుకు ఉంది. రేవంత్ సర్కార్ వచ్చాక ఇప్పటి వరకు పంప్‌లను ఆన్ చేయలేదు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో కొనసాగితే గరిష్ఠంగా 270 టీఎంసీలను ఎత్తిపోసే అవకాశం ఉండేది. మూడేండ్లలో ఎందుకు నీటిని ఎత్తిపోయలేదన్న ప్రశ్న రైతుల్లో ఉత్పన్నమవుతున్నది. ఇప్పటికే నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లు సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల మధ్యలో కేవలం 10 శాతం పెండింగ్ పనులను బూచిగా చూపిన సర్కార్ నీటిని ఎత్తిపోయలేదని ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. పాలమూరు పంపులను ఆన్ చేసి వరద జలాలను ఒడిసి పట్టి ఉంటే ఈ ఏడాది ప్రస్తుతం ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను జయించే అవకాశం ఉండేదని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు.