హైదరాబాద్, జనవరి 8, (నమస్తే తెలంగాణ): దుర్గంచెరువులో ఐదు ఎకరాల ఆక్రమణలకు పాల్పడ్డారంటూ పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ప్రకటించారు. పిటిషనర్‌పై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది అభ్యంతరం తెలపడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్‌ను మరో న్యాయమూర్తికి కేటాయించేలా ఫైలును చీఫ్ జస్టిస్ ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువును ఆక్రమించుకున్నారంటూ హైడ్రా అధికారి ఆనంద్ చేసిన ఫిర్యాదు మేరకు నిరుడు డిసెంబర్ 31న మాదాపూర్ పోలీసులు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. దీనిని కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, గురువారం జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ జరిపారు. హైడ్రా తరపున వాదించేందుకు ఎవరూ హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు ఆక్రమణలకు పాల్పడుతున్నారనే కేసులో వాదనలు వినిపించేందుకు ఒకరు కూడా లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసులో వాదనలు వినేందుకు నిరాకరించారు. దీంతో పిటిషనర్ న్యాయవాది రామవరం చంద్రశేఖర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైడ్రా తరఫున న్యాయవాది లేరని వాదనలు వినకపోతే ఎలాగని, ఇది క్రిమినల్ కేసు కాబట్టి విచారణ చేపట్టాలని కోరారు. పోలీసులు నమోదుచేసిన కేసులు పిటిషనర్ అయిన ఎమ్మెల్యేకు వర్తించవని వాదించారు. పోలీసులు పిటిషనర్‌పై చేసిన ఆరోపణలను పరిశీలిస్తే.. 2014లో మట్టి పోశారని ఉందన్నారు. 2018లో పిటిషనర్ భార్య సదరు భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. దీనికి సంబంధించిన సేల్ డీడ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ దశలో న్యాయమూర్తి కల్పించుకుని డాక్యుమెంట్స్ రూపొందించడం ఎమ్మెల్యే స్థాయిలోని వాళ్లకు సులభమేనని వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేసుకు ఎమ్మెల్యేకు సంబంధంలేదని మరోసారి నొకి చెప్పారు. భూమిని ఎమ్మెల్యే భార్య కొన్నారని అన్నారు. ఎమ్మెల్యేపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ప్రకటించారు. పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గణేశ్ వాదనలు వినిపించారు.