
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐజీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ డిమాండ్ చేశారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఏఐజీఈఎఫ్ జాతీయ కార్యవర్గ సమవేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. కొవిడ్‌తో మరణించిన ఉద్యోగ కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేయాలని, ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్న తెలంగాణ సర్కారును కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకోవాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ సూచించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెంచినట్లుగానే కేంద్రం పీఆర్సీని వర్తింపజేసి వేతనాలు పెంచాలన్నారు. సమావేశాల్లో ఏఐజీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, అసోసియేట్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.