మైలార్‌దేవ్‌పల్లి, ఏప్రిల్ 30: తెలంగాణలో తలసేమియా వ్యాధి నివారణకు అవిశ్రాంతంగా పోరాడుతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీనిలో భాగంగా హెచ్‌బీఏ-2 పరీక్షను తప్పనిసరి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. శనివారం ఆయన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శాస్త్రీపురం డివిజన్ రాఘవేంద్ర కాలనీలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి జాతీయ సదస్సును ప్రారంభించారు. తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
జన్యుపరమైన తలసేమియా వ్యాధిని నిరోధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నదని చెప్పారు. తలసీమియా బాధితులకు ఉచితంగా రక్తం అందిస్తున్న కమల సొసైటీకి అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు కృషిచేస్తున్న సీఎం కేసీఆర్.. ఇప్పటికే అల్వాల్, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, ఎల్బీనగర్లో 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ అధ్యక్షుడు చంద్రకాంత్ అగర్వాల్, శ్యామ్ సుందర్ లోయ, నరేశ్ రాతి, ప్రదీప్ ఉప్పల, కే రత్నావళి, డాక్టర్ సుమన్ జైన్, ఎంఏ అలీమ్ బేగ్, మనోజ్ రూపానీ, రమ ఉప్పల తదితరులు పాల్గొన్నారు.