నిరాశాజనకంగా కేంద్ర బడ్జెట్
ప్రభుత్వ ఉద్యోగుల పెదవి విరుపు
పన్ను మినహాయింపు ప్రకటన లేకపోవడంపై నిరాశ
తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆగ్రహం
ఫ్రెండ్లీ సర్కారుగా తెలంగాణ ప్రభుత్వానికి కితాబు
కేంద్ర బడ్జెట్.. అదొక ఆశల పల్లకీ.. చిరు వ్యాపారి నుంచి కార్పొరేట్ కంపెనీ అధినేత వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నుంచి గ్రామస్థాయిలో చిరుద్యోగి వరకు.. అందరూ తమకు కేంద్రం నుంచి ఏం వరం రాబోతుందని ఎదురుచూస్తారు.. ఆసక్తిగా మంగళవారం పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ‘పద్దు’పై సబ్బండ వర్గాలు మండిపడుతున్నాయి.. ఇది కేవలం కార్పొరేట్ బడ్జెట్ అని, రైతు వ్యతిరేక బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. ఈ బడ్జెట్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులూ పెదవి విరుస్తున్నారు.. తమ డిమాండ్లను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఉమ్మడి జిల్లాకు చెందిన వేతన జీవులు నిరాశకు గురయ్యారు. ఆదాయ పన్ను మినహాయింపుపై ఏడేండ్ల నుంచి పోరాడుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం, ఫిబ్రవరి 2: గుండు సూది నుంచి అణ్వస్ర్తాల వరకు అన్నింటికీ విలువనే నిర్దేశించేది కేంద్ర బడ్జెట్. చిరువ్యాపారి నుంచి గెజిటెడ్ స్థాయి అధికారి వరకు బడ్జెట్ కోసం ఎదురుచూస్తారు. పద్దుతో తమకు ఎలాంటి లాభం చేకూరిందన్న అంచనాలు వేసుకుంటారు. ఎందుకంటే దేశాభివృద్ధిలో వీరందరూ భాగస్వాములే. అందరూ పన్నులు చెల్లించేవారే. వారందరూ బడ్జెట్లో వరాలు కోరుకోవడం సహజం. తాజాగా మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సబ్బండ వర్గాలు మండిపడుతున్నాయి. కేవలం కార్పొరేట్ కంపెనీల బడ్జెట్, రైతు వ్యతిరేక బడ్జెట్ అని ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు పరిశ్రమ, భద్రాచలం టు కొవ్వూరు రైల్వేలైన్, గిరిజన విశ్వవిద్యాలయం, కొత్తగూడెం విమానాశ్రయం నెలకోల్పే విషయంపై కేంద్ర ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఉభయ జిల్లాల ప్రజలను నిరాశపరిచింది. మరోవైపు పన్ను చెల్లింపుల్లో ఎలాంటి రాయితీలు ప్రకటించకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు, సంఘాల నేతలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఉద్యోగులు..
ఉమ్మడి జిల్లాలో సుమారు 9500 మంది ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 6 వేల మందికి పైగా ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లింస్తున్నట్లు సమాచారం. వీరేకాక మరో వెయ్యి నుంచి 1,500 మంది కేంద్ర ప్రభుత్వ కొలువులు చేస్తున్నారు. వీరందరూ ఏండ్ల నుంచి ఐటీ రిటర్న్స్ చేస్తున్నారు. వీరంతా సాలీన వేతనం రూ.10 లక్షలలోపు ఉద్యోగులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని డిమాండ్లు వచ్చినా కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ కాలంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని, నిత్యావసర ధరలు పెరిగాయని, ఆ ప్రభావం ఉద్యోగులపైనా పడుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏడేండ్ల నుంచి పన్ను చెల్లింపుల్లో రాయితీలు ఇవ్వకపోగా ఆదాయ పన్ను స్లాబులు, స్టాండర్డ్ డిడక్షన్, 80-సి పరిమితులనూ మార్చలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఫ్రెండ్లీ సర్కార్.. తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ఉద్యోగులతో స్నేహపూర్వక బాంధవ్యాన్ని కొనసాగిస్తున్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వేతన జీవులను అక్కున చేర్చుకున్నారు. ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. చిన్న ఉద్యోగి నుంచి గెజిటెడ్ ర్యాంకు ఉద్యోగుల వరకు వేతనాలు పెంచారు. కానీ కేంద్రం నుంచి ఉద్యోగులకు ఎలాంటి సహకారం లేకపోయింది. పన్ను రాయితీల్లో ఎలాంటి మినహాయింపులు లేవు. దీంతో ఉద్యోగుల జీతాల్లో ఎక్కువభాగం పన్ను చెల్లింపునకే సరిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నప్పటికీ కేంద్రం వారికి ఎలాంటి వరాలు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తమవుతున్నది.
వివక్ష కనిపిస్తున్నది..
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర సర్కార్ ఎల్లప్పుడూ ముందుంటుంది. కేంద్రానికి మాత్రం ఎలాంటి పట్టింపు లేదు. ఉద్యోగుల గురించి ఆలోచించకపోవడం విచారకరం. ఉత్తర భారత రాష్ర్టాలకు చెందిన ఉద్యోగులను ఒక విధంగా, తెలుగు రాష్ర్టాలకు చెందిన ఉద్యోగులను ఒక విధంగా చూస్తున్నది. మాపై వివక్ష చూపుతున్నది. కేంద్ర ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించాల్సిందే.
-తుంబూరు సునీల్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
వేతన జీవుల ద్రోహి ప్రధాని మోదీ..
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ద్రోహం చేసేలా ప్రధాని మోదీ కేంద్ర బడ్జెట్ రూపొందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు విధించే పన్నుల్లో రాయితీ ఇవ్వాలని ఏండ్ల నుంచి డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మోదీ ప్రభుత్వం వేతన జీవుల సమస్యలను పెడ చెవిన పెడుతున్నది. ఉద్యోగులు అంటే కేంద్రానికి చులకన. రానున్న రోజుల్లో మా సత్తా ఏమిటో చూపిస్తాం.
– అఫ్జల్, టీఎన్జీవో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
ఉద్యోగుల బాగోగులు పట్టని కేంద్రం..
దేశంలో కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు కలిగించడం కోసమే కేంద్ర బడ్జెట్. దీనితో చిన్న, మధ్య తరగతి ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఉన్నత వర్గాల ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రధాన ఉద్దేశం. పేద వర్గాల ఉద్యోగులు ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఆదాయ పన్ను రాయితీని పెంచకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-పిల్లి వీరస్వామి,
ఎంపీవోల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
వేతనంలో ఎక్కువగా పన్నులకే..
కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా మధ్య తరగతి ప్రజలు, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్ట పోతున్నారు. వచ్చే వేతనంలో అధికభాగం పన్నులు చెల్లించడానికే సరిపోతుంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో అనేక విధాలుగా ఇబ్బందిపడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆదాయ పన్ను రాయితీ పెంచాల్సిన అవసరం ఉంది.
-చిలక బత్తిన రమేశ్, గిర్దావర్, నేలకొండపల్లి