హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): విమాన ఇంధనం కూడా కల్తీ అవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రోడ్డుపై తిరిగే వాహన ఇంధనం కల్తీ అయితే రోడ్డు మీదే జనం ఇబ్బందులు పడతారని, గాలిలో ప్రయాణించే విమానంలోని ప్రయాణికుడి పరిస్థితి ఏమిటని కాంట్రాక్టర్‌పై మండిపడింది. విమాన ఇంధనంలో కల్తీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రాణమంటే లెకలేకుండా ఉందా అని ప్రశ్నించింది. విమాన ఇంధనం కల్తీపై తన కాంట్రాక్ట్ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ కాంట్రాక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. పిటిషనర్‌కు రూ.10 లక్షలు జరిమానా విధించింది.
ట్యాంకర్లలో ఇంధనాన్ని కల్తీ చేస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ చర్యను సవాలుచేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన గుర్నాథం వేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ నగేశ్ భీమపాక కొట్టివేశారు.