హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఏండ్లుగా అనధికారికంగా విధులకు గైర్హాజరు అవుతున్న ప్రభుత్వ వైద్యులపై వేటు వేసేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లలో పనిచేస్తున్న 43 మంది ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొన్నేండ్లుగా విధులకు హాజరుకావడం లేదని ఉన్నతాధికారులు గుర్తించారు. వివరణ ఇవ్వాలంటూ గతంలో నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేదు. ఈ ఘటనపై వేసిన విచారణ కమిటీ సైతం 38 మంది వైద్యులను సర్వీస్ నుంచి తొలగించాలని నివేదిక ఇచ్చింది. ఈ మేరకు చివరి అవకాశం ఇస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. వారంలోగా వివరణ ఇవ్వాలని లేదంటే.. సర్వీస్ నుంచి తొలిగిస్తామని స్పష్టం చేసింది. ఇందులో పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కొందరైతే ఏకంగా 2001 నుంచి గైర్హాజరులో ఉండటం విశేషం.