పాపన్నపేట, మే 30 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. పాపన్నపేట మండల పరిధిలోని మిన్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం నాడు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే ఆలస్యమయ్యాయని.. వెంటనే కొనుగోళ్లు పూర్తిచేసి, వెంటవెంటనే లారీల్లో పంపించాలని ఆదేశించారు.
మిన్పూర్లో ధాన్యం బస్తాలను వెంటవెంటనే పంపకపోవడం పట్ల నిర్వాహకులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రాయపోల్ మండల పరిధిలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు దగ్గర పడ్డాయని కేవలం మిన్పూర్, కొండపాక. ముద్దాపూర్ గ్రామాలలో వెనుకబడినట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ అనుకున్న విధంగా లారీలు అందుబాటులో లేకపోతే మరిన్ని లారీలు తెప్పించుకొని రైతులకు ఏమాత్రం ఇబ్బందులు ఎదురవకుండా ధాన్యాన్ని తరలించాల్సిందిగా కలెక్టర్ సూచించారు. రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలన్నారు.