జిల్లాలోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన వేలాది ఎకరాలపై ప్రభుత్వం కన్నేసింది. ఎన్నో ఏండ్లుగా ఆ భూములను సాగు చేసుకుని జీవిస్తున్న బక్క రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలు, ప్రజావసరాల పేరుతో వేలాది ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. తమ భూములను తీసుకోవద్దని.. వాటినే నమ్ముకుని జీవిస్తున్నామని అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నా సర్కారు మాత్రం కనికరించడంలేదు.
పోలీసులను ప్రయోగించి బలవంతంగా సేకరిస్తుండడంతో వేలాది మంది అన్నదాతలు రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చింది. అసైన్డ్ పట్టాలు పొంది 30 నుంచి 50 ఏండ్లుగా భూములను సాగు చేసుకుంటున్న రైతులకు సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం భూములను సేకరిస్తున్నది. ఇప్పటివరకు సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధిన భూములన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాలకు చెందినవే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే జిల్లాలో సుమారు నాలుగు వేలకు పైగా ఎకరాల అసైన్డ్ భూములను సేకరించింది. తాజాగా మరిన్ని ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది.
– రంగారెడ్డి, జూన్ 19 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం వెయ్యి ఎకరాల భూమిని సేకరించింది. కొంగరకలాన్‌లోని ఎగ్జిట్ నం. 13 నుంచి ట్రిపుల్ ఆర్ ఆకుతోటపల్లి వరకు 41 కిలోమీటర్ల పొడవు 330 ఫీట్ల వెడల్పుతో నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు సుమారు 1004 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ భూసేకరణతో సన్న, చిన్నకారు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన 4,725 మంది రైతులు రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చింది. భూముల్లేకుండా తాము రోడ్డున పడుతామని అన్నదాతలు ఎంత మొత్తుకున్నా సర్కార్ మాత్రం కనికరించలేదు. పోలీసులను పెట్టి మరీ బలవంతంగా సేకరించి హద్దురాళ్లను ఏర్పాటు చేసింది.
రాత్రికి రాత్రే నోటిఫికేషన్లు
అసైన్డ్ భూముల సేకరణకు ప్రభుత్వం రాత్రికి రాత్రే నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. గత ఆరు నెలల్లో ప్రభుత్వం 8 నోటిఫికేషన్లు జారీచేసింది. గత డిసెంబర్లో కందుకూరు మండలంలోని తిమ్మాపూర్‌లో సర్వే నం.88లో 350 ఎకరాలు, సర్వే నం.162లో 2017 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ భూములన్నీ పేద, దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందినవే. అలాగే, ఫిబ్రవరి మొదటి వారంలో మహేశ్వరం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో ఇండస్ట్రియల్, ఐటీ పార్కు స్థాపన పేరుతో 198 ఎకరాలకు, మార్చి 13న కందుకూరు మండలంలోని తిమ్మాయపల్లిలోని సర్వే నం.9లో 439 మంది రైతుల నుంచి 366 ఎకరాలు, మహేశ్వరం మండలంలోని కొంగరకుర్దు సర్వే నం.289లో 94 మంది నుంచి 277 ఎకరాలు, యాచారం మండలంలోని మొండిగౌరెల్లిలోని సర్వే నం.19, 68, 127లలో 638 మంది రైతుల నుంచి 821 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ భూములను 638 మంది రైతులు గత 30-40 ఏండ్లుగా సాగుచేసుకుని జీవిస్తున్నారు. దీంతో వారు లబోదిబోమంటున్నారు.
గోశాలకు రైతుల భూములు
మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన సర్వే నం.108లో 99 ఎకరాలను గోశాల నిర్మాణం పేరుతో ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించింది. ఆ గ్రామానికి చెందిన సుమారు 50 నుంచి 60 మంది రైతులు గత 70 ఏండ్లుగా ఈ భూములను సాగుచేసుకుని జీవిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పోలీసు పహారా మధ్య..
భూసేకరణకు రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నా.. ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడంలేదు. పోలీసుల సహకారంతో రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుని భూసేకరణ చేపడుతున్నది. మరికొన్ని చోట్ల రైతులను మభ్యపెట్టి ఆ ప్రక్రియను పూర్తి చేస్తున్నది. తిమ్మాయపల్లిలో సర్కారు చేపట్టిన ఎంజాయ్మెంట్ సర్వేలో రైతులంతా స్వచ్ఛందంగా ఇస్తున్నారని చెప్పినా చాలామంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. కానీ, వారు తమ నిర్ణయాన్ని బయటికి చెప్పేందుకు ముందుకు రావడంలేదు. భూసేకరణతో జిల్లాలోని పేదలకు భూమిపై హక్కులు లేకుండా పోయే ప్రమాదమున్నది.