బంజారాహిల్స్, మార్చి 20: ప్రపంచవ్యాప్తంగా వణుకుడు (పార్కిన్సన్స్) వ్యాధికి భారత్ కేంద్ర బిందువుగా మారుతున్నట్టు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కు చెందిన న్యూరాలజీ విభాగం వైద్య బృందం అధ్యయనంలో వెల్లడైంది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో నిమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్‌పై సింపోజియం నిర్వహించారు. ఈ సందర్భంగా లండన్‌లోని కింగ్స్ మెడికల్ కాలేజ్ దవాఖానకు చెందిన పార్కిన్సన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ డైరెక్టర్ డాక్టర్ వినోద్ మెట్టా, నిమ్స్ న్యూరాలజీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ రూపమ్ బొర్గోహెయిన్ మాట్లాడుతూ..
భారత్‌లో 5.80 లక్షల పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వ్యాధికి ఐరోపాలో విస్తృతంగా ఉపయోగిస్తున్న అపోమోర్ఫిన్ థెరఫీని తెలుగు రాష్ర్టాల్లోని రోగులకు అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఇటీవల 50 ఏండ్లలోపు వారిలోనూ పార్కిన్సన్స్ సమస్యలు పెరుగడం ఆందోళనకర విషయమని చెప్పారు. నిమ్స్‌లో ఈ వ్యాధికి సరైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సెలెరా న్యూరో సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ బాబు నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.