మహబూబ్‌నగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్‌కు మరో 24గంటల సమయం ఉండడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి హాట్‌హాట్‌గా మారింది. మంగళవారంతో తొలి విడుత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగియడంతో గ్రామపంచాయతీలో ఇక విందులో వినోదాలతో జల్సాలు మొదలయ్యాయి. గత వారం రోజుల నుంచి పంచాయతీల్లో మైకుల గోలతో కిటకిటలాడింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి విడుత 492 పంచాయతీ సర్పంచులకు పోలింగ్ జరుగనుంది.
అదేవిధంగా 3,720 వార్డులకు సభ్యులను ఎన్నుకుంటారు. అయితే 492 స్థానాలకు 1669 మంది, 3,720 వార్డులకు గానూ 8,944 మంది బరిలో ఉన్నారు. గురువారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా జిల్లాల పోలీస్ యంత్రాంగం పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రానికల్లా పోలింగ్ సామగ్రిని సిబ్బందిని పంపించనున్నారు.
పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు కూడా వెలువడుతుండడంతో గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి విడుత ఎన్నికల సమరంలో ఆయా పార్టీలు తమ క్యాండిడేట్లకు మద్దతు ఇచ్చాయి. మరోవైపు అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పడం లేదు. కొన్నిచోట్ల ఒకరికి బదులు మరొకరు కూడా పోటీకి సై అనడంతో ఆయా పార్టీలు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక సైలెంట్‌గా ఉన్నాయి. మొత్తంపైన తొలి విడుత ఎన్నికల పోలింగ్‌లో పల్లెలు రెడీ అవుతున్నాయి.