ఎక్కువసేపు ‘స్క్రీన్’కు అతుక్కుపోయే వారిలో ‘కళ్లు పొడిబారడం’లాంటి సమస్య కనిపిస్తున్నది. కళ్లమీద మూడు పొరలతో కూడిన ‘టియర్ ఫిల్మ్’ ఉంటుంది. గంటల తరబడి డిజిటల్ స్క్రీన్లు చూస్తూ ఉంటే.. ఆ ప్రభావం టియర్ ఫిల్మ్‌పై పడి కళ్లు పొడిబారుతాయి. అలాగే నిర్లక్ష్యం చేస్తే.. సమస్య మరింత తీవ్రమవుతుంది. స్క్రీన్‌పై పనిచేస్తున్నా.. వీడియోలు చూస్తున్నా.. కళ్లు ఆర్పడం తగ్గిస్తాం. దీనివల్ల కంట్లోని తడి ఆవిరయ్యే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
ఫలితంగా కళ్లు పొడిబారుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు స్క్రీన్లపై పనిచేసేటప్పుడు మధ్యమధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. కంప్యూటర్ స్క్రీన్.. మీ కంటి స్థాయికి దిగువన ఉండేలా చూసుకోవాలి. అప్పుడప్పుడూ కళ్లను ఆర్పుతూ ఉండాలి. గోరువెచ్చని నీటితో కనురెప్పలను శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రి పడుకునే ముందు.. కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ లాంటివి చేసుకోవాలి. దీనివల్ల కంటికి తగిన విశ్రాంతి లభిస్తుంది.