న్యూఢిల్లీ: భవిష్య నిధి (పీఎఫ్)ని తక్షణమే భీమ్ యాప్ ద్వారా ఉపసంహరించుకునే అవకాశాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కల్పించబోతున్నది. రానున్న రెండు లేదా మూడు నెలల్లో ఈ సదుపాయం ఈపీఎఫ్‌వో సభ్యులకు అందుబాటులోకి రాబోతున్నది. దీంతో 30 కోట్ల మందికిపైగా సభ్యులు ప్రయోజనం పొందుతారు.
ఆరోగ్యం, విద్య, ప్రత్యేక పరిస్థితుల్లో అడ్వాన్స్ కోసం క్లెయిము చేసి, సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ కార్పస్‌ను తమకు అవసరమైనపుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది ఏటీఎం విత్‌డ్రాయల్ సర్వీస్ మాదిరిగానే ఉంటుంది. ఈపీఎఫ్‌వో సభ్యులు సొమ్మును యూపీఐ-లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం భీమ్ యాప్‌నకు మాత్రమే పరిమితమైనప్పటికీ, త్వరలోనే ఇతర యూపీఐ యాప్స్‌కు కూడా విస్తరించే అవకాశం ఉంది.