ఈ ఏడాది ఎల్ నినో విపత్తు కారణంగా వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. దీంతో గోదావరి బేసిన్‌లోని చాలా రిజర్వాయర్లు తక్కువ నీటి నిల్వలతో ఉన్నాయి. ఈ బేసిన్‌లోని 57 ప్రధాన రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 418 టీఎంసీలు కాగా, ప్రస్తుతం వాటిలో కేవలం 94 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది. అంటే సుమారు 23 శాతం మాత్రమే నిల్వ ఉండగా, 77 శాతం సామర్థ్యం ఖాళీగా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులోకి వస్తున్న ప్రతి నీటిచుక్కనూ సద్వినియోగం చేసుకోవడం అత్యవసరం.
ప్రస్తుతం మేడిగడ్డ బరాజ్ దగ్గర గోదావరిలో సుమారు 15 వేల క్యూసెక్కులు దాటి ప్రవాహం నమోదవుతున్నది. ఈ ప్రవాహం సుమారు 89 మీటర్ల వద్ద ఉన్నది. వాతావరణ అంచనాల ప్రకారం ఎగువ ప్రాంతాల నుంచి రానున్న రోజుల్లో ప్రవాహాలు 60 వేల క్యూసెక్కులకు పైగా పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. సాంకేతికంగా పరిశీలిస్తే, మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండానే నీటి పంపింగ్ మొదలు పెట్టవచ్చు.
కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ దగ్గర కనీసం +93 మీటర్ల వద్ద నీటిమట్టం అందితే, మేడిగడ్డ బరాజ్‌పై ఆధారపడకుండా కూడా నీటిని ఫోర్‌బేలోకి మళ్లించి పంపింగ్ చేపట్టే అవకాశం ఉన్నదని పలువురు ఇంజినీర్లు, నిపుణులు గతంలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పంప్‌హౌస్ వద్ద నదిలో నీటిమట్టం సుమారు 90 మీటర్ల వద్ద ఉన్నట్టు తెలుస్తున్నది. నదిలో ప్రవాహం 35 వేల నుంచి 45 వేల క్యూసెక్కులు దాటితే నీటిమట్టం 95 మీటర్ల వరకు చేరే అవకాశం ఉన్నది. అప్పుడు పంపులను పూర్తి సామర్థ్యంతో నిర్వహించడం మరింత సులభమవుతుంది.
రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా అందుబాటులో ఉన్న ప్రతి సాంకేతిక అవకాశాన్ని వినియోగించడం తక్షణావసరం. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వద్ద ప్రస్తుతం పెద్దగా నిర్మాణ సంబంధిత సమస్యలు లేవని పలువురు రిటైర్డ్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. అయినా వాటిలో కూడా నీటిని నిల్వ చేయకపోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి లింక్‌ను పూర్తిగా వినియోగంలోకి తీసుకురాకుండా కుట్ర పన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నిల్వలు చూస్తే, గోదావరిలో ప్రస్తుతం లభిస్తున్న ప్రవాహాన్ని సద్వినియోగం చేసుకుని కాళేశ్వరం ద్వారా ఈ రిజర్వాయర్లను నింపితే వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు, భూగర్భ జలాల పునరుద్ధరణకు ఎంతో మేలు జరుగుతుంది. అందుబాటులో ఉన్న నీటి ప్రవాహం, సాంకేతిక అవకాశాలు, రిజర్వాయర్లలోని తక్కువ నిల్వలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే పరిస్థితిని సమీక్షించాలి. కన్నెపల్లి పంపులను ప్రారంభించి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలి.
శ్రీరాంసాగర్-18.69/80 టీఎంసీలు
నిజాంసాగర్-6.65/17.80 టీఎంసీలు
ఎల్లంపల్లి-7.80/20 టీఎంసీలు
మిడ్ మానేరు-8.30/27 టీఎంసీలు
లోయర్ మానేరు-5.80/24 టీఎంసీలు
అన్నపూర్ణ-1.40/3.50 టీఎంసీలు
రంగనాయకసాగర్-1/3 టీఎంసీలు
మల్లన్నసాగర్-14.15/50 టీఎంసీలు
కొండపోచమ్మసాగర్-6.41/15 టీఎంసీలు
– రాము బొడ్డుపల్లి 9440142523