నర్సాపూర్ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నర్సాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి ఏమి జరగలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్ విమర్శించారు. మంగళవారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అశోక్ గౌడ్, నయీమొద్దీన్, మాజీ కౌన్సిలర్లు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నర్సాపూర్‌లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు జరిగాయని, కాంగ్రెస్ హయాంలో ఒక్క ఇటుక కూడా పెట్టిన పాపాన పోలేదని మండిపడ్డారు.
తహసీల్దార్ పాత కార్యాలయాన్ని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కూల్చారని మాజీ మున్సిపల్ చైర్మన్ మరళీ యాదవ్ అనడం సమంజసం కాదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. కూల్చిన భవనాల స్క్రాప్ దొంగలు ఎవరో ప్రజలకు తెలుసని, వారిపైన కేసులు పెట్టి కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇప్పటికైన తప్పుడు ఆరోపణలు మానుకొని, వ్యక్తిగత విమర్శల జోలికి వెల్లవద్దని హెచ్చరించారు.
గత 20 సంవత్సరాలుగా నర్సాపూర్‌ను సర్పంచ్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా మురళీయాదవే పాలించాడని, నర్సాపూర్ అభివృద్ధి జరగలేదని ఆయనే చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నర్సాపూర్‌ను అభివృద్ధి చేయలేక చేతగాని సన్నాసిగా మారాడని మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నా తన 13వ వార్డుకు ఏంచేశాడో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 13వ వార్డుకు మురళీయాదవ్ శాపంగా మారిడని దుయ్యబట్టారు. ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్న 252 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు పంచకపోవడం సిగ్గుచేటన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ చైర్మన్‌గా తాను, తన కౌన్సిలర్లు 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేశామని అశోక్‌గౌడ్ గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.40 కోట్లు మున్సిపాలిటీకి మంజూరు చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే రూ.40 కోట్లు తిరిగి మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ భవనాలను పూర్తిచేయలేక చేతులెత్తేసిందని చురకలంటించారు. అధికార పార్టీ నాయకులు విమర్శించడం మానేసి నర్సాపూర్ మున్సిపాలిటీకి ఏంచేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
నర్సాపూర్ వెనుకబాటుకు అధికార పార్టీయే కారణమని, ప్రజలు చీ కొడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్, హరీష్ రావు, సునీతాలక్ష్మారెడ్డి జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మాజీ కౌన్సిలర్లు ఆంజనేయులుగౌడ్, రామచందర్, బీఆర్ఎస్ నాయకులు బాల్ రెడ్డి, ఆనంద్, షేక్ హుస్సేన్, రాకేష్ గౌడ్ నాగరాజు గౌడ్, జ్ఞానేశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.