సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందిన తరువాత రాత్రిపూట ఆఫీసులకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. కానీ, ఇలా పగటి పూట పడుకోవడం, రాత్రిపూట పనిచేయడం మన శరీరంపై అనేక రకాలుగా ప్రభావం చూపిస్తుంది. ఇందులో ఒకటి ఫెర్టిలిటీ. ఏదైనా ఓ పద్ధతి ప్రకారం జరగాలి. మన శరీరంలో జరిగే జీవక్రియలన్నీ కూడా ఓ సమయం ప్రకారం జరుగుతాయి. దీన్నే మనం జీవగడియారంగా భావిస్తాం. ఈ జీవగడియారాన్ని డిస్ట్రబ్ చేస్తే మెటబాలిజమ్ అంతా అడ్డదిడ్డంగా మారిపోతుంది.
పడుకోవాల్సిన సమయంలో పనిచేయడం, పనిచేసుకోవాల్సిన టైంలో పడుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితే ఏర్పడుతున్నది. అందుకే ఎక్కువమందిలో ఫెర్టిలిటీ సమస్యలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. షిఫ్ట్ జాబ్‌లు చేసేవాళ్లలో చాలామంది కొన్ని రోజులు పగలు, కొన్ని రోజులు రాత్రిపూట పని చేస్తుంటారు.
దాంతో జీవగడియారం దెబ్బతింటున్నది. రాత్రిపూట ఉద్యోగం చేసే మహిళల్లో అండం విడుదలలో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. అండాశయంలో నీటితిత్తులు ఏర్పడి అండోత్పత్తి జరగడం లేదు. అలా ఆడవాళ్లు సంతానలేమి సమస్య ఎదుర్కొంటున్నారు. ఇక మగవాళ్లలో రాత్రి షిఫ్టుల్లో పని చేయడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు.
ఈ కారణంగా శృంగారంపై ఆసక్తి పోతున్నది. వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుతున్నది. దీనికి ఊబకాయం తోడైతే వీర్యకణాల నాణ్యత దెబ్బతినడమే కాకుండా అంగస్తంభన సమస్యలు కూడా వస్తున్నాయని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే నైట్ షిఫ్ట్‌లు చేసేవాళ్లు వైద్యుల సలహా మేరకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.