బాన్సువాడ, డిసెంబర్ 11 : వరికి బదులుగా ఇతర పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయం నుంచి నస్రుల్లాబాద్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, యాసంగి పంటల సాగుపై స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ఆరుతడి పంటలతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని, కొవిడ్ ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీపీ విఠల్, వైస్ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు వాజిద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, పీఏసీఎస్ చైర్మన్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.