Police Custody : పశ్చిమబెంగాల్ సీఎం (West Bengal CM) సువేందు అధికారి (Suvendu Adhikari) పీఏ చంద్రనాథ్ రథ్ (Chandranath Rath) హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసులు బారాసాత్ కోర్టు (Barasat Court) లో హాజరుపర్చారు. పోలీసుల అభ్యర్థన మేరకు కోర్టు ఆ ముగ్గురికి 13 రోజుల పోలీస్ కస్టడీ (Police Custody) విధించింది. దాంతో పోలీసులు ఆ ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు. హత్య ఎందుకు చేశారు..? ఆ హత్య వెనుకు ఉన్న కారణం ఏమిటి..? ఎవరైనా వెనుక ఉండి హత్య చేయించారా..? లేదంటే హతుడితో పాతకక్షలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు ఆ ముగ్గురిని ఇంటరాగేట్ చేయనున్నారు.
#WATCH | North 24 Parganas, Barasat | The court sent the three suspects – Mayank Raj Mishra, Vicky Maurya and Raj Singh- arrested in connection with the murder of Chandranath Rath, personal assistant of CM Suvendu Adhikari, to 13 days of police custody.
(Visuals of the three… pic.twitter.com/IwzzBBsud8
— ANI (@ANI) May 11, 2026
కాగా గత బుధవారం హత్య జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులను యూపీఐ పేమెంట్ ఆధారంగా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి విశాల్ శ్రీవాస్తవ, రాజ్ సింగ్, మయాంక్ మిశ్రాలను అదుపులోకి తీసుకున్నారు. కోల్కతా సమీపంలోని ‘బ్యాలీ’ టోల్ ప్లాజా వద్ద నిందితులు చేసిన యూపీఐ పేమెంట్ వారిని పట్టించింది. ఇదిలావుంటే గత బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చంద్రనాథ్ రథ్ తన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉండగా ఈ హత్య జరిగింది.
చంద్రనాథ్ రథ్ మహీంద్రా స్కార్పియో వాహనం ముందర ప్యాసింజర్ సీటులో కూర్చుని ఉండగా దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మొదట సిల్వర్ రంగు నిస్సాన్ మైక్రా కారుతో రథ్ ఎస్యూవీని అడ్డగించారు. ఆ వెంటనే బైక్పై వచ్చిన హంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. అనంతరం ఆ కారును అక్కడే వదిలేసి మరో ఎరుపు రంగు కారు, బైక్పై పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితులు వాడిన మైక్రా కారును గుర్తించారు.
ఆ కారు కోసం ఓ టోల్ ప్లాజా వద్ద యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించినట్లు తేలింది. ఆ చెల్లింపు ఆధారంగా నిందితుల వివరాలు సేకరించిన పోలీసులు.. వారిని బీహార్, ఉత్తర ప్రదేశ్లలో అరెస్ట్ చేశారు. పట్టుబడిన ముగ్గురూ వృత్తిపరమైన హంతకులని, వీరిలో విశాల్ శ్రీవాస్తవపై హత్య, దోపిడీ సహా 15కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.