నర్సాపూర్,ఏప్రిల్ 14 : వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక పోతున్నదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ఆమె నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడీలకు ఫోన్ల పంపిణీలో రూ.30 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తే విచారణ చేయాల్సింది పోయి, తొలి సీఎం, ప్రతి పక్షనేత కేసీఆర్‌కు లీగల్ నోటీసులు ఇవ్వడం ఏమిటని మంత్రి సీతక్క తీరును వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఖండించారు.
అంగన్వాడీ టీచర్లకు 5జీ ఫోన్లు ఇస్తున్నామని చెప్పి ఫోర్ జీ ఫోన్లు అండకడుతున్నారని ఆరోపించారు. ఫోన్ల పంపిణీలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆధారాలతో సహా చూపిస్తే , మంత్రి సీతక్క చెప్పు తెగుద్దని అనడం ఏమాత్రం సంస్కారం అన్నారు. ప్రతి విషయానికి తాను గిరిజన మహిళను మంత్రి సీతక్క చెప్పుకోవడం బాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.96 వేల కోట్లు అయితే,రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ-కార్ రేస్‌లో అవినీతి జరిగిందని, కాళేశ్వరం, ఫోన్‌ట్యాపింగ్‌లో అవినీతి జరిగిందని కోర్టు కెళ్తే సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ నేతలకు బుద్ధిరావడం లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి వంటివారే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని,పాలన బాగాలేక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనా అని ప్రభుత్వాన్ని సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. సమావేశంలో నర్సాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నహీమొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు పంబళ్ల భిక్షపతి, కౌన్సిలర్ మోహిజొద్దీన్, నాయకులు రింగుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.