హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకే సరిపోయింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన నాటి నుంచి సోమవారం బాచుపల్లి- మియాపూర్ ఫ్లైఓవర్ వరకు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులే కావడం విశేషం. ఎప్పుడో పూర్తికావాల్సిన ఆరు లేన్ల బాచుపల్లి ఫ్లైఓవర్‌ను సీఎం సోమవారం ప్రారంభించారు.
ఇది సైబరాబాద్ వైపు ప్రయాణించే వారికి గొప్ప ఉపశమనాన్ని అందించనున్నది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆరులేన్ల బాచుపల్లి ఫ్లైఓవర్‌కు 2022లో నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నగరంలో మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం నగరంలో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను చేపట్టింది. 1.3 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్‌కు హెచ్ఎండీఏ రూ. 141 కోట్లు ఖర్చు చేసింది.