తెలంగాణలో సాగిన నిజాం వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటానికి ‘బండెనక బండి గట్టి’ పాట నిలువుటద్దం పడుతుంది. ఆ పాట పల్లవిలోనే నిజాం రాజు పోలీసు, మిలిటరీ దాడులను ఖండిస్తూ ‘నాజీల మించినవురో’ అనే మాట ఉంటుంది. జర్మనీలో అప్రజాస్వామిక పద్ధతుల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని రెండో ప్రపంచ యుద్ధం ద్వారా ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన నాజీల నాయకుడే హిట్లర్. మానవజాతికే మాయని మచ్చగా హిట్లర్ గురించి చెప్పుకుంటారు. నాజీ నియంత సృష్టించిన మారణహోమం అన్నిరకాల హద్దులను చెరిపేసింది. యుద్ధంలో కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. 60 లక్షల మందికి పైగా యూదులు నిర్బంధ శ్రామిక శిబిరాల్లో మాడిపోయారు. ఆ దుర్మార్గ పాలనను అంతమొందించటానికి ప్రపంచం చాలా మూల్యమే చెల్లించుకున్నది.
చాలా దేశాల్లో నాజీ విధానాల సమర్థన, హిట్లర్ ఆరాధన పూర్తిగా నిషేధం. కానీ అలాంటి నియంత తనకు ఆదర్శమని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సహజంగానే చర్చ జరుగుతున్నది. ‘హిట్లర్ నాకు స్ఫూర్తి.. హిట్లర్ కోర్ టీమ్ పేరైన హైడ్రాను ఆయన స్ఫూర్తితోనే తీసుకొచ్చాను’ అని రేవంత్ వక్కాణించారు. అంతేకాదు..‘యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించినం.. హైడ్రాతో ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్‌లో ఇండ్లను కూల్చినం. నగరంలో భయాన్ని పుట్టించినం’ ఈ ఆణిముత్యాలను ఓ విద్యావంతుల వేదికపై ఆయన ఒలకబోయడం విశేషం.
ఇవేదో పొరబాటునో, గ్రహపాటునో చేసిన వ్యాఖ్యలు అనుకోలేం. అవి రేవంత్ రాజకీయ చారిత్రక అవగాహనకు అద్దం పడుతున్నాయి. హైడ్రా పేరిట జరిగిన ఘోర విధ్వంసం గురించి సంబరపడిపోతూ చెప్పటం, అందుకు హిట్లర్ అనే పేరుమోసిన నరహంతకుడిని స్ఫూర్తిగా చెప్పుకోవటం కొంత విడ్డూరంగా అనిపించినప్పటికీ ఆయనలో అంతర్లీనంగా దాగున్న భావజాలపరమైన వాసనలు ఎగదన్నుకు వచ్చాయని చెప్పవచ్చు. హిట్లర్ ప్రచార మంత్రి గోబెల్స్ కూడా తనకు ఆదర్శమని చెప్పి ఉంటే ఇంకా ఆ అంకం రక్తికట్టేది. ఒక అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేస్తారనేది గోబెల్స్ ప్రచార సూత్రం.
ఆ తరహా ప్రచారంలోనూ బాగా ఆరితేరిన ముఖ్యమంత్రి పనిలో పనిగా ప్రజాపాలన పేరిట సాగించిన సకల రంగాల విధ్వంసాన్ని కూడా గొప్పగా చెప్పుకొని ఉంటే ఇంకా బాగుండేది. విచిత్రమైన విషయం ఏంటంటే గాంధేయ వారసత్వం గురించి గొప్పగా చెప్పుకొనే పార్టీ ఇలాంటి హిట్లర్ అభిమానులకు పదవులు కట్టబెట్టడం కాంగ్రెస్ పార్టీ భావదారిద్య్రాన్ని తెలియజేస్తున్నది. లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఇండియాకు తిరిగివస్తున్న గాంధీని జర్మనీకి రావాలని హిట్లర్ ఆహ్వానిస్తే ఆయన గట్టిగా తిరస్కరించటం గురించి రేవంత్‌కు ఎవరైనా చెప్పి ఉంటే బాగుండేది. రేవంత్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ పతనవాస్థ ‘ఆకాశంబందుండి’ అన్నట్టు అధఃపాతాళానికి జారిపోయింది.
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఓ బాబు ఏదో సభలో తాను సాధించబోయే జీడీపీ గురించి ఇంతింతలుగా చెప్పుకొన్నారు. అదే సభలో ఉన్న ఓ విదేశీ మంత్రి ‘మా దేశంలో ఇలాంటి హెచ్చులు మాట్లాడితే పిచ్చాసుపత్రిలో పెడతారు, లేదంటే జైలులో పెడతారు’ అని అన్నారు. అప్పట్లో పత్రికల్లో వచ్చిన ఆ చురక సంచలనం కలిగించింది. ఇపుడు రేవంత్‌రెడ్డి హైడ్రా వ్యాఖ్యలూ అంతకుతక్కువేం కాదు. ఇలాంటి ఉన్మాద ప్రేలాపనలు ఆయనకు కొత్తకాదు. ఈ ‘అభినవ హిట్లర్’ ప్రజాకంటక బుల్డోజర్ పాలన ఇప్పటికే రాష్ర్టాన్ని పెరికి కుప్పలు పోసింది. మాయదారి మాటలతో గద్దెనెక్కిన మోసకారి కాంగ్రెస్ సర్కార్‌ను సాగనంపాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి చాలాకాలమైంది. ఇప్పుడు కావాల్సింది ప్రజల చేతికి ఒక చాన్స్ దొరకడమే.