ఉస్మానియా యూనివర్సిటీ : కులగణన ( Caste Census ) చేయనున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే దానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొల్లెపల్లి స్వామి గౌడ్ (Bollepalli Swami Goud ) డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రం విధి విధానాలు ప్రకటించే ముందు దేశంలో ఉన్న బీసీ మేధావులను, బీసీ ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి వారి సూచనలను తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న బీసీలను కులాలవారీగా, ఉపకులాల వారీగా, షరతులు పెట్టకుండా లెక్కించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం లెక్కించే కులగణన మీదనే బీసీల భవిష్యత్ ఆధారపడి ఉందని అభిప్రాయపడ్డారు.
విద్య, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ రంగాలలో బీసీల వాటా వారికి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కుల గణన చేయాలని అన్నారు. దేశంలో అనధికారికంగా బీసీలు 60 శాతం పైగా జనాభా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లెక్కించే జనాభా లెక్కల్లో కనీసం 60 శాతం బీసీలు లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం చేసిన గణనను తప్పుడు సర్వే గానే భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సురేష్, లింగాల మహేష్, శ్రీకాంత్, పండరి, అంజి, రాజు తదితరులు పాల్గొన్నారు.