మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 19: పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 పథకం కింద నిధులను మంజూరు చేసి, పనులు ప్రారంభించి రెండేళ్లయినా ఇప్పటివరకు 50 శాతం వరకు కూడా పనులు పూర్తవ్వలేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టినా పనులు పూర్తికాకపోవడం, ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట పటణాల్లో అమృత్ 2.0 పథకం కింద రూ. 141.05 కోట్లు 2024 మంజూరయ్యాయి. ప్రస్తుతం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడడంతో మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలు ఇందులో విలీనమయ్యాయి. పాత విధానంలోనే మున్సిపాలిటీల వారీగా ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
ఇందులో మంచిర్యాల మున్సిపాలిటీకి రూ. 48.05 కోట్లు, నస్పూర్ మున్సిపాలిటీకి రూ.73 కోట్లు, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి రూ. 20 కోట్లు మంజూరయ్యాయి. 2024 మార్చి 10న ఈ పనులకు ఎమ్మెల్యే పీఎస్సార్ శంకుస్థాపనలు చేశారు. రెండేళ్లలో ఈ పనులను పూర్తిచేయాలని నిర్దేశించారు. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం లాంటి అంశాలతో కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మంచిర్యాల పట్టణంలో సాయికుంట ఏరియాలో 600 కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మించాల్సిన నీటి ట్యాంకు పనులు ఇప్పటికీ పిల్లర్ల నిర్మాణ స్థాయికే పరిమితమయ్యాయి, 39 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 23 కిలో మీటర్ల మేర మాత్రమే ప పైపులైన్లను విస్తరించారు. కొత్తగా విస్తరించిన ప్రాంతాల్లో 6070 నల్లా కనెక్షన్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు ఈ ప్రక్రియ ప్రారంభమే కాలేదు.
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి పథకం పనులకోసం రూ. 73కోట్లు మంజూరవగా కలెక్టర్ ఆఫీస్ ఏరియా, సీతారాంపల్లి, హౌసింగ్‌బోర్డు, నందనవనం, ఆర్కే6ఏరియా, నస్పూర్ బస్టాండ్ ఎదురుగా, ఊరు శ్రీరాంపూర్ బస్టాండు ఎదురుగా ఏడు ప్రాంతాల్లో నీటి ట్యాంకులను నిర్మించాల్సి ఉంది. ఇందులో ఈ ఏడు ట్యాంకులు కేవలం పిల్లర్ల లెవెల్ వరకే పనులు పూర్తయ్యాయి. ఇక్కడ 40 కిలో మీటర్ల మేరకు పైపులైన్లు వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 20 కిలోమీటర్ల వరకు పైపులైన్లను విస్తరించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీకి రూ.20కోట్లు మంజూరవగా వీటితో పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఏరియాలో నిర్మించే ట్యాంకు పనులు 25శాతం, ఉత్కూరు చౌరస్తా ఏరియాలో నిర్మించే నీటి ట్యాంకు పనులు 75 శాతం, ఎమ్మార్వో ఆఫీస్ వెనకాల నిర్మించే నీటిట్యాంకు పనులు 50 శాతం మేరకు మాత్రమే పూర్తయ్యాయి.
ఇక్కడ 15కిలో మీటర్ల వరకు పైపులైన్లను విస్తరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 7 కిలో మీటర్ల వరకు మాత్రమే పూర్తిచేశారు. ప్రజలకు ఎంతో ముఖ్యమైన తాగునీటి పథకం పనుల విషయంలో కూడా అధికార యంత్రాంగం ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి పైప్‌లైన్, ట్యాంకుల నిర్మాణల పనులను పూర్తిచేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.