Govt Schools | హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులు తగ్గుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ఏటా ఎన్రోల్మెంట్ పడిపోతుండటంపై ప్రశ్నించింది. చదువుల కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా.. ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గుతున్నదని ఆరా తీసింది. ఇది అత్యంత కలతపడాల్సిన అంశమని, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని, మూల కారణాలను విశ్లేషించాలని రాష్ట్ర విద్యాశాఖకు సూచించింది. సమగ్రశిక్ష ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు(పీఏబీ) 2025-26 నివేదికను కేంద్రం గురువారం విడుదల చేసింది.
నివేదికలో ఎన్రోల్మెంట్ తగ్గుదలపై కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 42,901 స్కూళ్లుంటే 30,022(70%) ప్రభుత్వ స్కూళ్లే. వీటిల్లో ఎన్రోల్మెంట్ కేవలం 38.11శాతమే(27.8లక్షల విద్యార్థులే). అదే ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 12,126(28.26%)గా ఉంటే.. వీటిల్లో 44.31లక్షలు(60.75%) విద్యార్థులు చదువుతున్నారు. ఒక్క కరోనా సంవత్సరం(2021-22) మినహాయిస్తే 2018 నుంచి 2024 వరకు సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గుతున్నది. ప్రైవేట్ స్కూళ్లల్లో ఎన్రోల్మెంట్ పెరుగుతున్నది. ఈ ధోరణి అత్యంత ప్రమాదకరమని కేంద్రం ఈ నివేదికలో ప్రస్తావించింది. రాష్ట్రంలో గతంలో వెయ్యిలోపున్న జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య ఇప్పుడు 1,900కు చేరడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది.
కేంద్రం సమగ్రశిక్ష నిధులు విడుదల చేసినా రాష్ట్రం సకాలంలో ఖర్చు చేయకపోవడంతో ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ. 461కోట్ల బడ్జెట్‌ను కత్తిరించింది. 2024-25లో రూ.1,948 కోట్లకు ఆమోదం లభించగా, ఇప్పుడు రూ.1,487 కోట్లకే కేంద్రం పరిమితం చేసింది. అంటే రూ. 461కోట్లు తగ్గించింది. రాబోయే విద్యాసంవత్సరానికి రాష్ట్రం రూ.1,564 కోట్లకు ప్రతిపాదనలు సమర్పించగా, కేంద్రం కేవలం రూ. 1,487 కోట్లకే పరిమితం చేసింది. ముఖ్యంగా స్పిల్ ఓవర్ (నడుస్తున్న పథకాలు, కార్యక్రమాలకు) రూ. 628 కోట్లు ఖర్చుచేయాల్సి ఉండగా, రాష్ట్రం కేవలం రూ.238కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. మరో రూ.72కోట్లను సరెండర్ చేయగా, కొత్తగా రూ. 316 కోట్లను స్పిల్ ఓవర్ కింద ఖర్చు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.