హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో సీబీఎస్ఈ కరికులం ప్రవేశపెట్టనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు క్లాసులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఇటీవలే సర్కార్కు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలోని 194 మాడల్ స్కూళ్లలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన కొనసాగుతున్నది.
అయితే, ఇటీవల మాడల్ స్కూళ్లకు ఆదరణ తగ్గడంతో ఏటా 40వేలకు పైగా సీట్లు మిగులుతున్నాయి. తల్లిదండ్రుల అభిరుచుల్లోనూ మార్పులు చోటుచేసుకొని సీబీఎస్ఈ స్కూళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మాడల్ స్కూళ్లను సంస్కరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్ఈ కరికులాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ సర్కార్కు ప్రతిపాదనలు పంపింది.