హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికకు బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ నెల 30న ఉదయం 7నుంచి రాత్రి 7 గంటలవరకు పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితం వెలువడుతుంది. ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, వ్యయ పరిశీలకులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి 20 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయని చెప్పారు. ఎక్కడైనా డబ్బు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం వస్తే వెంటనే సీజ్ చేస్తామని స్పష్టంచేశారు. పోలింగ్ ఏజెంట్లు విధిగా వ్యాక్సి నేషన్ సర్టిఫికెట్, లేదా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఏజెంట్లు విధిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశమిచ్చినట్టు చెప్పారు.
రెండువేల మంది బైండోవర్
హుజూరాబాద్‌లో రూ.3,50,01,027 నగదు, రూ.7,13,440 విలువ కలిగిన 1,091 లీటర్ల మద్యం, రూ.69,750 విలువ కలిగిన 11.4 కిలోల గంజాయి, రూ.44,040 విలువ కలిగిన పేలుడు పదార్థాలు, రూ. 2.21 లక్షల విలువగల చీరలు, షర్ట్లు, రూ.10.60 లక్షల విలువగల బంగారం, వెండి ఆభరణాలను సీజ్‌చేసినట్లు శశాంక్ గోయల్ వెల్లడించారు. అల్లర్లు సృష్టించే అవకాశమునన 2,284 మందిని తాసిల్దార్ ముందు బైండోవర్ చేశామని చెప్పారు.