బాల్కొండ/కమ్మర్పల్లి, ఫిబ్రవరి 18 : తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదన్న అనుమానాలు కలుగుతున్నాయని.. ప్రజలు ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ, కమ్మర్పల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఏడేండ్లలోనే చేసి చూపించారని తెలిపారు.
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న బీజేపీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అవమానిస్తుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, తెలంగాణ పౌరుషం లేదా అని నిలదీశారు. బాగుపడుతున్న తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలుపుతారా? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వ్యాఖ్యలు చూస్తే మళ్లీ ఆంధ్రాలో కలుపుతారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బీజేపీ నాయకులు రెచ్చగొట్టే మాటలకు మోసపోతే మళ్లీ పూర్వపు రోజుల్లాగే గోసపడుతామని ప్రజలు, రైతులు, యువకులు దీనిపై ఆలోచచన చేయాలని కోరారు.