Tiger | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఏరియాలో సంచరించిన పెద్దపులి మహారాష్ట్రకు చెందినదిగా భావిస్తున్నట్లు అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు. పెద్ద పులి కోసం తమ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని అధికారి తెలిపారు.
పెద్దపులి జాడ కోసం మూడు రోజులుగా అడవిలో 20 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. అయితే చీలపల్లి, ఆరగూడ వైపుగా మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించామని పేర్కొన్నారు. మహారాష్ట్ర అంతర్గాంలో తాజాగా ఓ పశువుపై పులి దాడి చేసిందని చెప్పారు. మహారాష్ట్రలో పశువుపై దాడి చేసిన పులి.. కాగజ్‌నగర్‌లో కనిపించిన పులి ఒక్కటే అని తాము భావిస్తున్నామని అన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని 15 గ్రామాల్లో అధికారులు 163సెక్షన్ విధించారు. కవ్వాల్ అభయారణ్యంలో నాలుగేళ్లలో పులుల సంఖ్య అనుహ్యంగా పెరిగిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నవంబర్‌లో సహజంగా మగ ఆడ పులులు జతకట్టే సమయం అని, అందులో భాగంగా పులులు సాధారణం కంటే తమ జోడు కోసం అడవిలో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంటాయని అధికారులు చెప్పారు. కొన్ని సందర్భాల్లో అడవిని దాటి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ సంచరిస్తూ ఉంటాయని వెల్లడించారు. ఈ సమయంలో పులులు సహజంగా కొంత ఉద్రేకంతో ఉంటాయని తెలిపారు. తమ తోడును వెతుకునే క్రమంలో పులులు చురుకుగా తిరుగుతూ ఉంటాయని, అందుకే నవంబర్,డిసెంబర్లో పులి దాడులు పెరుగుతున్నాయని అధికారులు వివరించారు