హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కళాశాలల అప్లియేషన్ ప్రక్రియ నత్తనడకను తలపిస్తున్నది. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్‌బోర్డు గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే చేరాలని, గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను వెబ్సైట్లో పొందుపరుస్తామని ఊదరగొట్టే ఇంటర్మీడియట్ బోర్డు.. ఇంతవరకూ అఫిలియేషన్లు పూర్తిచేయలేదు. ఏకంగా 128 సర్కార్ జూనియర్ కాలేజీలు అఫిలియేషన్ గుర్తింపునకు నోచుకోలేదు. అనుబంధ గుర్తింపును జారీచేయలేదు. దీంతో విద్యార్థులు అడ్మిషన్లు పొందలేని పరిస్థితిలో ఆందోళనకు గురవుతున్నారు. గురుకులాలు, కేజీబీవీలు, మాడల్స్కూళ్లు వంటి గవర్నమెంట్ సెక్టార్ కాలేజీలు 1,937 దరఖాస్తు చేయగా ఇప్పటి వరకు 1,089 కాలేజీలకు మాత్రమే గుర్తింపు దక్కింది. మరో 848 ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య కాలేజీలకు గుర్తింపు దక్కకపోవడం గమనార్హం.
ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమైనా సగం కాలేజీలకు కూడా ఆఫిలియేషన్ జారీ చేయలేదు. ఫలితంగా ప్రవేశాలపై ప్రభావం పడుతున్నది. పదో తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రవేశాలు పొందలేకపోతున్నారు. రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుంటే, ఇప్పటి వరకు 302 కాలేజీలకు మాత్రమే అనుమతి లభించింది. మరో 128 కాలేజీలకు ఇంటర్‌బోర్డు గుర్తింపునివ్వలేదు. సర్కార్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లాంఛనమే. అయినా గుర్తింపు లభించకపోవడం గమనార్హం. ఇక 194 మాడల్ స్కూల్స్ ఉంటే, ఇప్పటి వరకు 90 కాలేజీలకు అనుమతి లభించింది. 219 కేజీబీవీలు, 150 బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు, 82 గిరిజన గురుకులాలు, 105 సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలకు మాత్రమే అనుమతి లభించింది. సర్కార్ జూనియర్ కాలేజీలు, గురుకులాలకు అనుబంధ గుర్తింపు దక్కకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ బాట పడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఇక ప్రభుత్వ కాలేజీలు అలా ఉంచితే ప్రైవేట్ కాలేజీలకూ ఆఫిలియేషన్ దక్కలేదు. 1,424 కాలేజీలు దరఖాస్తు చేస్తే 210 కాలేజీలకు మాత్రమే అనుబంధ గుర్తింపునిచ్చారు. 347 కాలేజీల దరఖాస్తులను తిప్పిపంపినట్టు అధికారులు చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 247 కాలేజీలకు 47, మేడ్చల్ మల్కాజిగిరిలో 211 కాలేజీలకు 58 కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చారు. 13 జిల్లాల్లో ఒక్క కాలేజీకీ గుర్తింపునివ్వలేదు. కొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు చొప్పున కాలేజీలకే గుర్తింపునిచ్చారు. సరైనపత్రాలు సమర్పించకపోవడంతో గుర్తింపు నివ్వలేదని అధికారులు చెప్తున్నారు. ముందే ప్రక్రియను చేపట్టి పూర్తిచేయాల్సిందని కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.