మహబూబాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ కలెక్టరేట్లోని భూగర్భ, గనుల శాఖ కార్యాలయంలో శుక్రవారం సీఐడీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి నలుగురు సీఐడీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించారు. మొదట జిల్లాలోని పలు గ్రానైట్ క్వారీలను పరిశీలించారు. అనుమతి లేనిప్రాంతాల్లో ఏమైనా తవ్వకాలు జరిపారా? లీజు తీసుకున్న మేరకే తవ్వకాలు జరిపారా? అనే కోణంలో సోదాలు చేశారు.
అనంతరం కలెక్టరేట్లోని గనుల శాఖ కార్యాలయానికి వెళ్లి గ్రానైట్ క్వారీల నుంచి రవాణా అయిన మెటీరియల్ వివరాలు, సీనరేజ్ అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి.. ఏడీ రమణారెడ్డి, ఏజీ నిరంజన్‌తో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అయితే, తనిఖీల వివరాలు వెల్లడించేందుకు సీఐడీ అధికారులు నిరాకరించారు.