యాప్‌ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయడంలో రేవంత్‌రెడ్డి సర్కారు ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. పాలన చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని ఘాటుగా విమర్శించారు. శనివారం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, రైతుల పట్ల రేవంత్‌రెడ్డి సర్కార్ అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఖలీల్‌వాడి, జూన్ 20: ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.తెలంగాణ సిద్ధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, వ్యవసాయ రంగా న్ని అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. రైతు అభివృద్ధే.. రాష్ట్ర అభివృద్ధి అనే సంకల్పంతో అనేక వినూత్న పథకాలను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు.
రైతును రాజుగా భావించి రైతు సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి ఏడాదికి రూ.10వేల చొప్పు న సాయం అందించారని తెలిపారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి అందించడంతో రైతులు ఎలాం టి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునే పరిస్థితులు కల్పించారని వివరించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీరందించడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. రైతుబంధు పథకంతో సుమారు రూ.77 వేల కోట్ల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేశారని, రైతులకు రూ.27 వేల కోట్లకు పైగా రుణ సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు.
యాప్‌లో పేరు తో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని బిగాల మండిపడ్డారు. వర్షాకాలం సాగు ప్రారంభమైన సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సిన బా ధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ ఆ బాధ్యతను విస్మరించి యాప్‌లు, ఆన్లైన్ విధానాల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఎరువులు, విత్తనాలు, సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతాంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి లేదని, అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. రైతు కష్టాలను అర్థం చేసుకుని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమని గుర్తుచేశారు.రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.