హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీ ప్రభుత్వం కృష్ణానీటిని యథేచ్ఛగా మళ్లిస్తున్నది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండకముందే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి అక్రమంగా కృష్ణాజలాలను తరలించుకుపోతున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చిందే తడవుగా నీటి అక్రమ తరలింపును ఏపీ ప్రారంభించింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, గత వర్షాలకు 191 టీఎంసీలకు చేరుకొన్నది. నీటిమట్టం 873 అడుగులకు చేరుకోగానే ఏపీ నీటి మళ్లింపునకు పూనుకొన్నది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా తెలుగుగంగ, హంద్రీనీవా సుజల స్రవంతి, ఎస్ఆర్బీసీ కాలువల ద్వారా యథేచ్ఛగా నీటిని తరలిస్తున్నది. గత 15 రోజుల్లోనే దాదాపు 10టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను మళ్లించినట్టు ఏపీ స్వయంగా వెల్లడించిన గణాంకాలు. కానీ, క్షేత్రస్థాయిలో అంతకు రెండింతలు జలాలను మళ్లించిందని రాష్ట్ర నీటిరంగ నిపుణులు వాదిస్తున్నారు.
జూరాల నుంచి విడుదలవుతున్న నీటి లెక్కలకు, శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటున్న ప్రవాహానికి ఎక్కడా పొంతనలేకుండా పోతున్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా ఏపీ అదీనంలోనే కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లోను తక్కువగా చూపుతూ, పోతిరెడ్డిపాడు ద్వారా ఆ మేరకు జలాలను పెద్దమొత్తంలో తరలిస్తున్నదని నీటిరంగ నిపుణులు, ఇంజినీర్లు వివరిస్తున్నారు. వాస్తవంగా ఆదివారం రోజున జూరాల ప్రాజెక్టు నుంచి 11,240 క్యూసెక్కుల వరదను దిగువకు నదిలోకే విడుదల చేశారు. ఆ జలాలన్నీ శ్రీశైలం రిజర్వాయర్‌కు నేరుగా చేరుకోవాలి. ట్రాన్స్మిషన్ నష్టాలను కలుపుకొన్నా కూడా 2వేల క్యూసెక్కుల వరద తగ్గిపోతుంది.
కానీ, శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్న వరదను ఏపీ కేవలం 2,450 క్యూసెక్కులను మాత్రమే లెక్కల్లో చూపుతున్నది. దాదాపుగా 8,750 క్యూసెక్కుల ప్రవాహాన్ని తక్కువగా చూపుతున్నది. ఆ జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ అక్రమంగా మళ్లిస్తున్నదని, ఈ నేపథ్యంలో తప్పుడు లెక్కలు చూపుతున్నదని నీటిరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. జూరాల అవుట్ ఫ్లో, శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో లెక్కల్లో భారీ వ్యత్యాసమూ అందుకు బలాన్ని చేకూరుస్తున్నది. బోర్డు సైతం నీటిమళ్లింపును పర్యవేక్షించడం లేదని, ఏపీ చెప్పిన లెక్కలనే పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం.
ఏపీ ప్రభుత్వం గతేడాది సైతం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా ఇష్టారీతిన జలాలను మళ్లించుకుపోయింది. వరద ప్రారంభం కాగానే జలాల మళ్లింపును చేపట్టింది. వాస్తవంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి ఏపీకి కేవలం తెలుగుగంగ 15, ఎస్ఆర్బీసీ (శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్) 19 టీఎంసీలు కలిపి మొత్తంగా 34 టీఎంసీలు కేటాయింపులే ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా నిరుడు నీటి సంవత్సరంలో ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే దాదాపు 210 టీఎంసీలను, మల్యాల లిఫ్ట్ ద్వారా 54, ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి 3.10 టీఎంసీలు మొత్తంగా ఒక్క శ్రీశైలం నుంచే 267.10టీఎంసీల కృష్ణా జలాలను తరలించుకుపోయింది.
నీటి సంవత్సరం ముగిసేవరకూ ఇండెంట్లు, నీటి విడుదల ఉత్తర్వులు లేకుండానే మళ్లించుకుపోయింది. అయినా తెలంగాణ ప్రభుత్వం నిలదీయలేదు, బోర్డు నిలువరించనూ లేదు. గతేడాది తరహాలోనే ప్రస్తుతం కూడా వరద ప్రారంభమైన వెంటనే జలాల మళ్లింపును చేపట్టింది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం జలాల వినియోగంపై ఇప్పటికీ దృష్టి సారించనేలేదు.