హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ చర్యలు చేపట్టింది. భీంరెడ్డితో ఆర్థిక, వ్యాపార సంబంధాలున్న దాదాపు 19 మంది డీఎస్పీలకు నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొంతమంది డీఎస్పీలను నేరుగా ఏసీబీ తన ఆఫీసుకు పిలిచి విచారించనున్నదని విశ్వసనీయ సమాచారం. ఆయా డీఎస్పీలు భీమ్‌రెడ్డి సూచించిన రియల్ఎస్టేట్ వ్యాపారాలు, కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, కొందరు నేరుగా భూములు కొనుగోలు చేశారని తెలిసింది. వెలుగులోకి వచ్చిన కొత్త ప్లాట్లు, ఫ్లాట్లతో నోటీసులు అందుకున్న డీఎస్పీలకు సంబంధాలు ఉన్నట్టు సమాచారం. దీని పై ఇప్పటికే డీఎస్పీ శ్రీనాథ్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి.. వివరణ కోరినట్టు తెలిసింది. కాగా, మీడియాకు అందుతున్న సమాచారం పట్ల డీజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి బినామీలుగా ఉన్న దాదాపు 15 మందికి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎవరెవరు ఏయే ఆస్తులకు బినామీగా ఉన్నారనే వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించారు. భీంరెడ్డి ఇంట్లో, బంధువుల ఇండ్లలో దొరికిన ఆధారాలతో మరికొంతమంది బినామీలను గుర్తించినట్టు తెలిసింది. ఏసీబీ గుర్తించిన బినామీలలో.. సింగవరపు శ్రీనివాసరావు (భీంరెడ్డికి ప్రధాన ఆర్థిక బినామీ), ప్రవీణ్‌కుమార్ ఆలూరి (ఆదిత్య హౌసింగ్ ప్రవేట్ లిమిటెడ్), తిరుపతిరెడ్డి అభిషేక్‌రెడ్డి, సింగవరపు లక్ష్మి (భీంరెడ్డి భార్య), శ్రావణిరెడ్డి, తాటిపర్తి ఇంద్రకరణ్‌రెడ్డి (బంధువు), హరిప్రియ జయమ్మ (భీంరెడ్డి సోదరి), శ్రీనివాసన్, సాయి నితిన్, హోంగార్డు లక్ష్మణ్, మంజుగౌడ్, సరిత, రవి నార్వ, వరంగల్ జిల్లాకు చెందిన బిల్డర్ ప్రజాపతి, సర్వేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సురేశ్‌కు ఆస్తుల వివరాలు తెలుపాలంటూ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.
భీమ్‌రెడ్డి కేసులో ప్రముఖ ఓ టాలీవుడ్ నటుడికి ఏసీబీ అధికారులు నోటీసులిచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఓ ఇల్లు కొనుగోలు విషయంలో కొంత డబ్బు చెల్లించిన ఆ నటుడికి ఇల్లు పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో అతని పేరును భీమ్‌రెడ్డి తన డైరీలో రాసుకోవడంతో ఏసీబీ అధికారులు లావాదేవీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. తెలుగు రాష్ర్టాల్లో టీవీ రంగంలో సుపరిచితమైన సంస్థగా పేరొందిన ఓ కంపెనీతో కూడా భీమ్‌రెడ్డి కుటుంబీకులకు వ్యాపార సంబంధాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.