రామగిరి, మే 11 : తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘టీజీఐసెట్-2026’ను నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు టీజీఐసెట్ కన్వీనర్ అల్వాల రవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 రీజియన్స్ పరిధిలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 56,223 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు చెప్పారు. మూడు షిఫ్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్షలకు ఎంజీయూతోపాటు పలు యూనివర్సిటీలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్లను ప్రత్యేక పరిశీలకులుగా నియమించినట్టు వెల్లడించారు. తొలిరోజు రెండు షిఫ్టులు, రెండో రోజు ఉదయం షిఫ్టులో పరీక్ష ఉంటుందన్నారు.
ప్రతి రోజూ ఉదయం 10 నుం చి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాని గంట ముందుగానే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరని వెల్లడించారు. ఉర్దూ మీడియం, దివ్యాంగ అభ్యర్థులకు తొలిరోజు మధ్యాహ్నం పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సులువుగా చేరుకునేలా హాల్‌టికెట్లపై ఆయా పరీక్ష కేంద్రాలకు సంబంధించిన రూట్‌మ్యాప్‌తో పాటు బార్కోడ్ స్కానర్ ఉంటుందని పేర్కొన్నారు.