హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం, పీక్ డిమాండ్ అమాంతం పెరుగడం, బహిరంగ మార్కెట్లో విద్యుత్తు దొరక్కపోవడంతో థర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో ఉత్పత్తిని పెంచాలని టీజీ జెన్కో నిర్ణయించింది. థర్మల్ ప్లాంట్లలో రోజుకు 140 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. శుక్రవారం 76.83 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మాత్రమే జెన్కో ఉత్పత్తి చేసింది. యాదాద్రి, భద్రాద్రి, కాకతీయ, కొత్తగూడెంలో థర్మల్ ప్లాంట్లుండగా, ఈ నెల 23న 92.82, 24న 86.36 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అయ్యింది.
శుక్రవారం అది 76కు పడిపోయింది. విద్యుదుత్పత్తి తగ్గుతుండగా, జెన్కో యాజమాన్యం మాత్రం 140 మిలియన్ యూనిట్ల టార్గెట్ పెట్టింది. వైటీపీఎస్‌లోని నాలుగు ప్లాంట్లు కష్టకాలంలో ఆదుకుంటున్నాయి. 2022-23లో రోజుకు 69.71 మిలియన్ యూనిట్లుగా ఉన్న నాలుగు థర్మల్ ఉత్పత్తి ప్లాంట్లు అందుబాటులోకి రావడంతో 2025-26 నాటికి 78.88 మిలియన్ యూనిట్లకు, 2026 -27కు వచ్చేసరికి 90.23 మిలియన్ యూనిట్లకు చేరింది.
రాష్ట్రంలో థర్మల్ విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరిపోవడంలేదు. ముఖ్యంగా యాదాద్రి ప్లాంట్‌ను బొగ్గు కొరత సమస్య వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో జెన్కో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గును తెప్పించనున్నది. ఇందుకు ఇటీవలే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రోజుకు ఐదు మిలియన్ టన్నుల బొగ్గును మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి కొనుగోలు చేయనున్నది. సింగరేణికి చెందిన నైనీ కోల్‌బ్లాక్ నుంచి రోజూ ఐదు ర్యాకుల వరకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ (బీటీపీఎస్)లో షట్‌డౌన్ అయిన యూనిట్-1 ఎట్టకేలకు వినియోగంలోకి వచ్చింది. బాయిలర్ ట్యూబ్ లీక్ కావడంతో నిలిచిపోగా, ఇప్పుడు తిరిగి పునరుద్ధరించారు.