రవీంద్రభారతి, హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 16.57 లక్షల మంది విద్యార్థుల ఫీజులు, స్కాలర్షిప్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ నెల 10న కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్ కార్యాలయాలను ముట్టడిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలిపారు. కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్లు చెల్లిస్తున్నారని, విద్యార్థులకు రూ.వందల కోట్లు చెల్లించేందుకు మనసు రావడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అప్పుగా తెచ్చిన తెచ్చిన రూ.80 వేల కోట్లను ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలలుగా విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు.