హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల పాలకవర్గాలు ఖాళీ కానున్నాయి. బుధ, గురువారాలతో పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. దీని కోసం ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం ఆదేశాలు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో 539 మంది జడ్పీటీసీ సభ్యులు, 28 మంది జడ్పీ చైర్మన్ల పదవీకాలం గురువారంతో ముగియనుంది.
ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం జడ్పీ చైర్మన్ల పదవీకాలం ఆగస్టు 7న ముగుస్తుంది. స్పెషల్ ఆఫీసర్ల నియామకంపై పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిందని సమాచారం. జిల్లా పరిషత్‌లకు కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా ఉండనున్నారని సమాచారం. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. 5817 మంది ఎంపీటీసీ సభ్యులు, 539 ఎంపీపీల పదవీ కాలం ఈనెల 3వ తేదీతో పదవీకాలం ముగియనుంది. మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించనున్నారు. జిల్లా కలెక్టర్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం గ్రామస్థాయిలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది.
నేడు కోర్టులో విచారణ
పంచాయతీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరుతూ గతంలో వేసిన కోర్టు కేసు విచారణకు మంగళవారం రానుంది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసే ఆఫిడవిట్ కీలకంగా మారనుంది. కొత్త ప్రభుత్వం, ఎన్నికల కోడ్, తదితర కారణాలను చూపుతూ ఇప్పటి వరకు సమయం అడుగుతూ వచ్చింది. పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బీసీ రిజర్వేషన్లు ఖరారు అయితే అవే అన్ని స్థానిక సంస్థలకు వర్తిస్తాయి. కాగా, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసింది.