న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పరీక్ష ఒత్తిడిని తగ్గించి ఏడాదంతా వేచి ఉండకుండా తమ ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఇచ్చేందుకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలకు విద్యార్థులను అనుమతించనున్నారు. 2026 విద్యా సంవత్సరం నుంచి ఇది అమలులోకి రానున్నది. కొత్త పథకం కింద ప్రతి విద్యార్థి ఫిబ్రవరి మధ్యలో జరిగే మొదటి పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుంది. తమ మార్కులను మెరుగుపరుచుకోవాలని ఆశించే విద్యార్థులు లేదా మూడు సబ్జెక్టులలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మేలో జరిగే రెండవ పరీక్షకు హాజరు కావచ్చు. నూతన విద్యా విధానం(ఎన్ఈపీ) 2020 సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త విధానంలో ముఖ్యాంశాలు
ఒత్తిడి తగ్గించడానికే…
మొదటిసారి హాజరవుతున్న అభ్యర్థులు, కంపార్ట్మెంట్ అభ్యర్థులు, తప్పనిసరిగా రాయాల్సిన విద్యార్థులు, స్కోర్లను మెరుగుపరుచుకునేందుకు హాజరవుతున్న విద్యార్థులకు ఈ కొత్త విధానం వర్తిస్తుందని సీబీఎస్ఈ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రెండవ పరీక్ష ఇంప్రూవ్మెంట్ క్యాటగిరి, మొదటి/మూడవ చాన్స్ కంపార్ట్మెంట్ కేసులు, కంపార్ట్మెంట్, ఇంప్రూవ్మెంట్ సబ్జెకులు కలపిన విద్యార్థులకు వర్తిస్తుందని సీబీఎస్ఈ తెలిపింది. నిర్దిష్టమైన గ్రూపుల కోసం ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్షల సమయంలో క్రీడా పోటీలలో పాల్గొనాల్సిన విద్యార్థులు, శీతాకాలంలో ప్రారంభమయ్యే స్కూళ్లకు చెందిన విద్యార్థులు మొదటి పరీక్షకు బదులుగా రెండవ పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపింది. మొదటి బోర్డు పరీక్షకు ముందు ఒకసారి మాత్రం అంతర్గత మదింపు నిర్వహించనున్నారు. భవిష్యత్తులో ఈ విధానాన్ని 12వ తరగతికి కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది.