ఇంఫాల్, నవంబర్ 18: మణిపూర్‌లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. జిరిబామ్‌లో తమ వర్గానికి చెందిన ఆరుగురి హత్యను నిరసిస్తూ మైతీలు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. కర్ఫ్యూ ఉత్తర్వులను లెక్కచేయకుండా నిరసనకారులు రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి జిరిబామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుపరా ప్రాంతంలో ఆస్తులు ధ్వంసం చేస్తున్న నిరసనకారులతో పోలీసులకు ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో అతౌబా అనే ఓ యువకుడు మరణించాడు. పోలీసు కాల్పుల్లోనే అతడు మరణించాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. అతడు కాల్పుల్లోనే మరణించాడని, అయితే ఎవరు కాల్పులు జరిపారనేది తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
కర్ఫ్యూ నిబంధనలు బేఖాతరు
కర్ఫూ ఉన్నప్పటికీ సోమవారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ(కోకోమి) నేతృత్వంలో మైతీలు సోమవారం నిరసనలు కొనసాగించారు. లంపేల్ఫాట్లోని ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. మణిపూర్ పరిణామాలపై వరుసగా రెండో రోజు సోమవారం కేంద్ర హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులతో మణిపూర్‌లో పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయడానికి 5,000 మందితో కూడిన 50 కేంద్ర సాయుధ పోలీసు బలగాలను(సీఏపీఎఫ్)ను పంపించాలని కేంద్రం నిర్ణయించింది. కాగా, సీఆర్పీఎఫ్ కాల్పుల్లో మరణించిన 10 మంది కుకీ మిలిటెంట్లకు నివాళిగా మంగళవారం చురచాంద్‌పూర్‌లో కాఫిన్(శవపేటిక) ర్యాలీ నిర్వహించనున్నట్టు కుకీ సంఘాలు ప్రకటించాయి.
ఎన్డీయే సమావేశం
మణిపూర్‌లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) మద్దతు ఉపసంహరించుకుంది. మణిపూర్‌లో సంక్షోభాన్ని పరిష్కరించి, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఎన్పీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఎన్డీఏ సమావేశాన్ని నిర్వహించారు. కాగా, ఏడుగురు ఎమ్మెల్యేలు కలిగిన ఎన్పీపీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం కొనసాగనున్నది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం ఆ పార్టీకి ఉంది.
బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా
రాష్ట్రంలో అధికార బీజేపీ నేతల ఇండ్లపై ఆందోళనకారులు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో కమలం పార్టీ నేతలు భయాందోళన చెందుతున్నారు. జిరిబామ్ జిల్లాలో పలువురు బీజేపీ ఆఫీస్ బేరర్లు సోమవారం మూకుమ్మడి రాజీనామా సమర్పించారు. రాష్ట్రంలో అత్యంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాళ్లంతా బీజేపీ అధిష్టానానికి రాసిన రాజీనామా లేఖలో గోడు వెళ్లబోసుకున్నారు.