న్యూఢిల్లీ: భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు, లెజెండరీ ప్లేయర్ లియాండర్ పేస్(Leander Paes).. ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు సమక్షంలో లియాండర్ పార్టీలో చేరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పేస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను కోల్కతాలో పేస్ కలిశారు.దీంతో టెన్నిస్ స్టార్ బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వినిపించాయి. 2021లో లియాండర్ పేస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2022 గోవా ఎన్నికల్లో అతను ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించాడు. కానీ పేస్ ఆ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీపడలేదు.
బీజేపీలో చేరిన తర్వాత పేస్ మాట్లాడారు. తన జీవితంలోని 40 ఏళ్ల పాటు దేశానికి ఆడానని, అనేక టోర్నీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించానని, డేవిస్ కప్, ఒలింపిక్స్లో ఆడి తనకు, తన కుటుంబానికి, దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు కొత్త ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నానని, తన సోదరులు తనకు బాధ్యతను అప్పగించారని, ఈ దేశానికి, యువతకు సేవ చేయాలని ఉందన్నారు. ప్రజాసేవ బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షా, నతిన్ నబిన్లకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.