ఎల్బీనగర్/మన్సూరాబాద్/చంపాపేట/వనస్థలిపురం, జనవరి 1: నూతన సంవత్సరంను పురస్కరించుకుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సహారాస్టేట్స్కాలనీలోని శ్రీలలితా నాగలింగేశ్వర స్వామి దేవాలయం, ఆదిత్యనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, విజయశ్రీకాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, సీఆర్ ఎన్‌క్లేవ్‌లోని పోచమ్మ దేవాలయం, శ్రీసాయినగర్కాలనీలోని శ్రీదుర్గాదేవి దేవాలయంతో పాటు తదితర ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డికి ఆయా కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో..
డివిజన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయి ఆలయమంత భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికిరి దీప్తి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, ఆలయ కమిటీ మాజీ ధర్మకర్తలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.
ఆలయాల్లో పూజలు, చర్చిలో ప్రార్థనలు..
దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ షిర్డీసాయిబాబా దేవాలయంతో పాటు కనకదుర్గా దేవాలయం, మోహన్‌నగర్‌లోని చిత్తారమ్మ దేవాలయం, కొత్తపేటలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మోహన్‌నగర్‌లోని సెంట్ మాథ్యూస్ పుల్ గాస్పెల్ చర్చిలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. చర్చి పాదర్ రెవరెండ్ దేవానంద్ కేక్ కట్ చేసి అందరితో నూతన సంవత్సర వేడుకలను జరుపుకొన్నారు. నూతన ఏడాదిలో అంతా కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకు సాగాలని కోరుకున్నారు.
లిటిల్ ల్యాంబ్ చర్చిలో..
వనస్థలిపురం లిటిల్ ల్యాంబ్ చర్చిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బ్రదర్ ఎం.ఇస్రాయల్ హాజరై ప్రత్యేక సందేశాన్ని అందజేశారు. అనంతరం ప్రార్థనలు, భక్తి పాటలతో సందడి నెలకొన్నది. కార్యక్రమంలో చర్చి వైస్ ప్రెసిడెంట్ కె.జార్జిముల్లర్, ఎన్.జాన్, కె.రఘురాం, రమేశ్, జాకబ్, ప్రసాద్, విజయలక్ష్మి, లాజరస్ పాల్గొన్నారు.