హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఒక్కసారిగా ఆవహించిన ఇగం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. చలిగాలి గజగజ వణికిస్తున్నది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న కిందిస్థాయి గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా భారీగా పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకుపైగా క్షీణించాయి. రాష్ట్రంలో సాధారణంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం 7.4 డిగ్రీలు తగ్గి 27.6 డిగ్రీలు మాత్రమే నమోదైంది.
గతేడాది నవంబర్ 29న 30.9 డిగ్రీలు రికార్డయినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. నాగర్కర్నూల్ జిల్లాలో గతేడాది 34.4 డిగ్రీలు నమోదుకాగా.. సోమవారం 10.8 డిగ్రీలు క్షీణించి 23.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నందున తేమ శాతం పెరిగింది. ఆకాశం మేఘావృతం కావడంతో అనేక జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 నుంచి 10.8 డిగ్రీలు తగ్గాయి. ఉదయం అనేక ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువగా 7 నుంచి 10.8 డిగ్రీల మధ్య, మిగిలిన 14 జిల్లాల్లో సాధారణం కన్నా 5 నుంచి 7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగింది. సోమవారం చాలా జిల్లాల్లో పగటి పూట ఎండకాయకపోవడంతో చలి వాతావరణం ఏర్పడింది.
నేడు తేలికపాటి వానలు
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ దీవుల పరిసర ప్రాంతాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 48 గంటల్లో అది బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రంలోకి బలంగా.. కిందిస్థాయి గాలులు వీస్తున్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉద యం వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువచ్చని వెల్లడించింది. రాష్ట్రంలో రాగల 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉం టుందని తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 18 డిగ్రీల మధ్య నయోదయ్యే చాన్స్ ఉన్నదని టీఎస్డీపీఎస్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో రాత్రి ఉష్ణోగ్రతలు.. 13.4 నుంచి 21.6 డిగ్రీల మధ్య నమోదైనట్టు పేర్కొన్నది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్, భీమ్పూర్ మండలం అర్లి(టి)లో అత్యల్పంగా 13.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.