థర్డ్ వేవ్ కారణంగా విడుదల నిలిచిపోయిన భారీ తెలుగు చిత్రాలన్నీ సోమవారం కొత్త తేదీలను ప్రకటించాయి. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’, పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ , మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాలు అధికారికంగా విడుదల ప్రకటనలు చేశాయి. తామెంతో ఎదురుచూస్తున్న స్టార్ హీరోల సినిమాలు విడుదల ఖరారు కావడంతో సినీ ప్రేమికులు, అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న ‘భీమ్లా నాయక్’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’ విడుదల తేదీ ఖరారైంది. పరిస్థితులను బట్టి ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని థియేటర్ లలో విడుదల చేస్తామని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. నిత్యామీనన్ నాయికగా నటిస్తున్నది. త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మాటలు అందించగా…సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. ‘భీమ్లా నాయక్’ విడుదల కోసం పవన్ అభిమానులు వేచి చూస్తున్నారు.
ఏప్రిల్ 24న ‘ఆచార్య’
చిరంజీవి, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించారు. తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ‘వేసవిలో పలు భారీ చిత్రాలు రిలీజ్‌కు ముందుకువస్తున్నాయి. ఈ కారణంగా పరస్పర అంగీకారం, అవగాహనతో రిలీజ్ డేట్ విషయంలో నిర్ణయం తీసుకున్నాం. ‘ఆచార్య’ ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు రానుంది’ అని చిత్ర నిర్మాతలు ప్రకటనలో తెలిపారు.
మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం, రణం, రుధిరం) విడుదల తేదీ ఖరారైంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ నాయికలుగా నటించారు. మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. గతంలో పలుసార్లు కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ హిందీ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్ లలో సందడి చేయబోతోంది. గోండు బెబ్బులి కొమురం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో కల్పిత పాత్రల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
మే 12న ‘సర్కారు వారి పాట’
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. కీర్తి సురేష్ నాయికగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్నారు. 14 రీల్స్ ఫ్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందీ చిత్రం. బ్యాంకింగ్ రంగ కథా నేపథ్యంతో సినిమా రూపొందుతోంది. థమన్ సంగీతాన్ని అందించారు.
భీమ్లా నాయక్-ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1
ఆర్.ఆర్.ఆర్- మార్చి 25
ఆచార్య- ఏప్రిల్ 24
సర్కారు వారి పాట- మే 12