హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ)/ఖలీల్‌వాడి: విశ్వ యవనికపై మెరిసేందుకు బతుకమ్మ మరోసారి సిద్ధమైంది. శనివారం రాత్రి 9.40, 10.40 గంటలకు రెండుసార్లు ప్రపంచంలోనే ఎత్తయిన బుర్జ్ ఖలీఫా భవనంపై బతుకమ్మ వీడియో ఎల్ఈడీ లైట్ల వెలుగుల్లో ప్రదర్శితం కానున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దేశవిదేశాలకు చెందిన కోట్లమంది ఒకేసారి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను వీక్షించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చరుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ‘అల్లిపూల వెన్నెల’ అనే బతుకమ్మ పాటను ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్‌తో రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. దానికి కొనసాగింపుగా తెలంగాణ పూల పండుగ బతుకమ్మ గొప్పతనాన్ని విశ్వవేదికపై చాటేందుకు సిద్ధమయ్యారు. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించబోయే ఎల్ఈడీ తెర (స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది. తెలంగాణ ప్రజాప్రతినిధులు, జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్దఎత్తున కార్యక్రమంలో హాజరుకానున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఇందులో పాల్గొంటారు. 829.8 మీటర్ల ఎత్తున్న ఈ భవనంపై ప్రదర్శించే లేజర్ షోలు, ఎల్ఈడీ తెరపై ప్రసారమయ్యే వీడియోలను ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది వీక్షిస్తారు. ఈ షోలను చూడటానికే ప్రతివారం వేలమంది పర్యాటకులు దుబాయ్ వెళ్తుంటారు.