హైదరాబాద్: ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌గౌడ్ (Kompelli Venkat Goud) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దవాణాకలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘వొడువని ముచ్చట’, ‘నీళ్ల ముచ్చట’, ‘సర్వాయి పాపన్న చరిత్ర’ వంటి పుస్తకాలను రాశారు. ఆయన మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ రచయిత, తెలంగాణ మట్టిబిడ్డ కొంపెల్లి వెంకట్ గౌడ్ ఇక లేరన్న వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ అన్నారు. వారి హఠాన్మరణం తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని, అనుభవాలను ‘వొడువని ముచ్చట’గా తెలంగాణ ప్రజలకు అందించిన ఆయన.. మరోవైపు ఆర్. విద్యాసాగర్ రావు ఆలోచనలను ‘నీళ్ల ముచ్చట’గా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి ఇద్దరు మహానుభావుల ఆలోచనలను శాశ్వతంగా పదిలపరిచారని అన్నారు. వీరితోపాటు ప్రముఖ సాహితీవేత్త నోముల సత్యనారాయణ వంటి ప్రముఖుల జీవితాలను కూడా గ్రంథస్తం చేశారని గుర్తుచేశారు. తన జీవితకాలం ఆద్యంతం తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంపల్లి వెంకట్ గౌడ్ పోషించిన పాత్ర అద్వితీయమని చెప్పారు.
అంతేకాకుండా, తన రచనల ద్వారా బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా అభ్యున్నతి కలగాలన్న ఆలోచన విధానంతో తన సాహిత్య జీవితాన్ని సాగించారని వెల్లడించారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి, ‘సర్వాయి పాపన్న’ చరిత్రను అక్షరబద్ధం చేసి ఈతరానికి అందించారు. తెలంగాణ తత్వం, ఉద్యమ స్ఫూర్తిని తన కలంలో నింపుకొని ఎన్నో రచనలు చేసిన ఆయన కృషి చిరస్మరణీయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ హఠాన్మరణం బాధాకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆయ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ మనో గతానికి ‘వొడువని ముచ్చట’గా, ఆర్. విద్యాసాగర్ రావు ఆలోచనలకు ‘నీళ్ల ముచ్చట’గా పుస్తక రూపం ఇచ్చారని తెలిపారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని తన రచనల ద్వారా చాటి, సర్వాయి పాపన్న చరిత్రను అక్షరబద్దం చేసి ప్రజలకు అందించారన్నారు. తెలంగాణ తత్వం, ఉద్యమ భావజాలాన్ని తన కలంలో నింపుకున్న కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతి తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటని చెప్పారు.