సినిమా: ఓజీ
తారాగణం: పవన్‌కల్యాణ్, మాళవిక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్‌రాజ్..
దర్శకత్వం: సుజిత్
సంగీతం: తమన్
నిర్మాత: డీవీవీ దానయ్య
విడుదలకు ముందే అంతులేనంత క్రేజ్‌ను సంపాదించుకున్న సినిమా పవన్‌కల్యాణ్ ‘ఓజీ’. ఈ సినిమా విడుదల కోసం అభిమానులంతా ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు తెరదించుతూ గురువారం ‘ఓజీ’ విడుదలైంది. ఒకరోజు ముందుగానే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో ‘ఓజీ’ హంగామా మొదలైంది. అంచనా ప్రకారం కేవలం ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా వందకోట్ల వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తున్నది. మరి గురువారం నుంచి అసలు షోలు మొదలయ్యాయి. మరి అభిమానులకు నచ్చేలా ‘ఓజీ’ ఉన్నదా? ఈసారి పవన్‌కల్యాణ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం.
కథ
1990ల్లో ముంబైలో జరిగే కథ ఇది. ముంబైలోని ఓ షిప్ యార్డ్‌కు ఓ కంటేనర్ వచ్చి చేరుతుంది. ఆ షిప్ యార్డ్ అధినేత సత్యా దాదా (ప్రకాశ్‌రాజ్). సమాజం గురించి ఆలోచించే మంచి మనిషి. తన షిప్ యార్డ్‌లో వచ్చిన ఆగిన కంటేనర్ నిండా ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ ఉన్న విషయాన్ని తెలుసుకున్న సత్యాదాదా అది విద్రోహుల చేతికి చిక్కితే దేశానికే ప్రమాదమని భావించి, దాన్ని ఎవరికీ తెలీకుండా దాచేస్తాడు. ఆ కంటేనర్ ఓమీ (ఇమ్రాన్ హష్మీ) అనే గ్యాంగ్స్టర్ది. తన కంటేనర్ కోసం ఓమీ వెతుక్కుంటూ ముంబై వస్తాడు. అది సత్యాదాదా పోర్టులో ఉందని తెలిసి, దాదా మనుషులందర్నీ వెంటాడతాడు. పదిమందిని బతికించేందుకు సత్యాదాదా నిర్మించిన ఈ సామ్రాజ్యం ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ ఓమీ కారణంగా సర్వనాశనం అయ్యేలా ఉంది. ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి ఒక్కడే రక్షించగలడు. అతడే.. ‘ఓజీ’ అని అందరితో పిలవబడే ఓజెస్ గంభీర(పవన్‌కల్యాణ్). తను ముంబై వదిలి 15ఏండ్లయింది. ఇప్పుడు తిరిగి రావాల్సిన పరిస్థితులు ముంబైలో ఉత్పన్నమయ్యాయి. అసలు ఈ ఓజెస్ గంభీర ఎవరు? తను ముంబై వదిలి ఎందుకు వెళ్లిపోయాడు? మళ్లీ ఎలా తిరిగొచ్చాడు? అసలు ఈ ఓజీ పుట్టుపూర్వోత్తరాలేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
వెళ్లేంతవరకే ఇది పవన్‌కల్యాణ్ సినిమా. థియేటర్లో కూర్చున్నాక ఇది పూర్తిగా దర్శకుడు సుజిత్ సినిమా. ఒక సూపర్‌స్టార్‌కి ఎలాంటి ఎలివేషన్స్ ఉంటే అభిమానులు పండుగ చేసుకుంటారో.. అలాంటి ఎలివేషన్స్‌తో అసలు సిసలైన ఫ్యాన్ మూవీ తీశాడు సుజీత్. తను స్వతహాగా పవన్‌కల్యాణ్ అభిమాని. ఒక అభిమాని తన అభిమాన నటుడ్ని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ‘ఓజీ’ చూస్తే తెలుస్తుంది. ఇది నిజానికి రొటీన్ కథే. కానీ ఆ కథను తనదైన శైలిలో, అద్భుతమైన ఎలివేషన్లతో కొత్తగా మార్చేశాడు సుజీత్. ఓ న్యూ సినేరియా తెరపై కనిపించింది. ఈ సినిమా ప్రారంభమైన 24 నిమిషాలు పవన్‌కల్యాణ్ కనిపించరు. కానీ ఉన్నట్టే అనిపిస్తుంది. అది సుజిత్ మ్యాజిక్. పవర్‌స్టార్‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా? అనే ఉద్వేగానికి ఫ్యాన్స్‌ని గురిచేశాడు. ఇక పవన్ ఇంట్రడక్షన్‌ని సుజిత్ చూపించిన తీరు, తమన్ ఆర్ఆర్ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంది. ఇక ఎంట్రీ అయ్యాక.. ఒక్క క్షణం కూడా సినిమా ఆగలేదు. పరుగులుపెట్టించాడు. ఈ సినిమాలో పవన్ కనిపించే ప్రతి ఫ్రేమూ అభిమానులకు నచ్చుతుంది. తుపాకుల శబ్దాలతో సినిమాను మోతమోగించినా.. కణ్మని ఎపిసోడ్‌తో కాస్త రిలీఫ్ ఇచ్చాడు సుజిత్. కథానాయిక కణ్మని పాత్రలో ప్రియాంక అరుళ్ మోహన్ ఒదిగిపోయింది. తెరపై దీపంలా ఉంది ప్రియాంక. పవన్, ప్రియాంక మధ్య సాగే సన్నివేశాలు హృద్యంగా ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్. ఆ సీన్‌కోసం అభిమానులు మళ్లీ మళ్లీ సినిమా చూస్తారు. కాకపోతే సినిమాలో హింస మాత్రం తీవ్రంగా ఉంది. అలాగే కథనం అక్కడక్కడ కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. మొత్తంగా ఫస్ట్‌హాఫ్ అదిరిపోయింది. సెకండాఫ్ మాత్రం కాస్త గాడి తప్పింది. అయితే.. చివరి 30 నిమిషాలు మళ్లీ ట్రాకెక్కింది.
నటీనటులు
పవన్‌కల్యాణ్ నట విశ్వరూపం ఈ సినిమా. దర్శకుడు సుజిత్‌కి పూర్తిగా సెరండర్ అయిపోయి నటించారాయన. దానికి తగ్గట్టు ైస్టెల్‌గా, అందంగా కనిపించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్లో అయితే.. ఫుల్ ఎనర్జీతో నటించారు. ఆయన మార్షల్ ఆర్ట్స్ కూడా సినిమాకు బాగా ఉపయోగపడింది. గ్యాంగ్‌స్టర్‌గా, యోధుడిగా, ప్రేమికుడిగా, తండ్రిగా.. ఇలా భిన్న పార్శాలు ఇందులో పవన్‌కల్యాణ్‌లో చూడొచ్చు. ఉన్నంతలో ప్రియాంక కూడా బాగా చేసింది. ప్రకాశ్‌రాజ్ ఎప్పటిలాగే తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇమ్రాన్ హష్మీ విలనిజం అంత గొప్పగా అనిపించదు. పవన్ ముందు తను తేలిపోయాడు. అర్జున్ దాస్ పాత్ర కూడా బావుంది.
సాంకేతికంగా
ఈ సినిమాకు నిజమైన హీరోలు సుజిత్, తమన్. నిజంగా వీరిద్దరు చలరేగిపోయారు. తమన్ అద్భుతమైన ఆర్ఆర్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్లో నిలబెట్టింది. అతను అలా ఇవ్వగలిగాడంటే.. దానికి కారణం సుజిత్ ఇచ్చిన అవుట్‌పుట్. అలా ఇద్దరూ పోటీపడి సినిమాను నిలబెట్టారు. కెమెరా వర్క్ అయితే చాలా బావుంది. ఎడిటింగ్ కూడా బావుంది. డైలాగులు కేజీఎఫ్‌ని గుర్తు చేసేలా ఉన్నాయి. మొత్తంగా మాస్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ‘ఓజీ’ బాగా నచ్చుతుంది. ముఖ్యంగా అభిమానులకైతే విందుభోజనమే.
బలాలు
పవన్‌కల్యాణ్ నటన, తమన్ ఆర్ఆర్, కథనం, సుజిత్ ైస్టెలిష్ మేకింగ్..
బలహీనతలు
కథ, సెకండాఫ్, హింస ఎక్కువ అవ్వడం
రేటింగ్ 3.5/5