మహబూబ్‌నగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఇదసలే కరెంటు పని. మీవల్ల కాదు. ఎత్తయిన విద్యుత్తు టవర్లు ఎక్కాలి. ఎండ, వాన, చలిలోనూ పనిచేయాలి. రోజూ ఉరుకులు పరుగులు తీయాలి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో విధి నిర్వహణ ఉంటుంది. ఇలాంటి ఉద్యోగం మీకెందుకు?’ అన్న మాటలను పట్టించుకోకుండా ఆ మహిళలు పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఆటంకాలను అధిగమించి ట్రాన్స్‌కో చరిత్రలో తొలిసారి జూనియర్ లైన్ విమెన్ ఉద్యోగం సాధించి తామెవరికీ తీసిపోమని నిరూపించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కోనేటిపురం 400 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో లైన్ విమెన్లుగా పనిచేస్తున్న శివనీల, నసీమ్బేగం, స్వప్న, సునీత, నందిని. పురుషులకు దీటుగా పనిచేస్తూ సత్తా చాటుతున్నారు. 20 అడుగుల ఎత్తు ఉన్న విద్యుత్తు స్తంభాలను, 400 కేవీ సబ్ స్టేషన్లో 40 అడుగుల ఎత్తున్న టవర్లను ఎక్కి మరమ్మతులు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. 400 కేవీ సబ్ స్టేషన్లో సుమారు 40 అడుగుల ఎత్తున్న బ్రేకర్స్పైకి ఎక్కడం అంత ఈజీ కాదు. పురుష ఉద్యోగులే చాలాసార్లు పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డ ఘటనలు ఉన్నాయి.
అలాంటి క్లిష్టమైన బాధ్యతల్లో మహిళలు విజయవంతంగా పనిచేయడం గొప్పవిషయమని ట్రాన్స్‌కోకు చెందిన ఓ సీనియర్ ఇంజినీర్ పేర్కొన్నారు. ఎంతో జాగ్రత్తగా ఇన్సులేటర్ల మీద కాలు పెడుతూ పైకి ఎక్కడం చాలా కష్టమని, కొంచెం పట్టుతప్పినా పైనుంచి పడిపోవడం ఖాయం. అయినా స్పెషల్ మెయింటనెన్స్ గ్యాంగ్‌లోని ఈ ఐదుగురు మహిళల పనితీరు అద్భుతంగా ఉన్నదని అధికారులు కితాబిస్తున్నారు.
నా భర్త సహకారంతోనే..
నేను పదో తరగతి తర్వాత డిప్లమో పూర్తి చేశాను. ఆ తర్వాత ఐటీఐ చేశాను. డిప్లొమా అర్హతతో ఏఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా కొంచెంలో మిస్సయ్యింది. 2018లో ట్రాన్స్‌కో జేఎల్ఎం పరీక్షలో క్వాలిఫై అయ్యాను. ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాను. నెల క్రితం కోనేటిపురం 400 కేవీ సబ్‌స్టేషన్‌లో ఉద్యోగంలో జాయిన్ అయ్యా. నాకు కేటాయించిన పనులు సులువుగానే చేస్తున్నా. బ్రేకర్ల మరమ్మతులు చేసేందుకు 40 అడుగుల ఎత్తున్న స్తంభాలు ఎక్కడం అలవాటుగా మారిపోయింది. నా భర్త రాజశేఖర్ సహకారంతోనే ఇక్కడివరకు వచ్చాను. శివలీల, జూనియర్ లైన్విమన్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్
నాన్న ఆశయం కోసం
మాది నిరుపేద కుటుంబం. నాన్న ఆశయం మేరకు నా భర్త సహకారంతో ఐటీఐ పూర్తిచేశాను. రూ.2 వేల వేతనంతో ప్రైవేటు ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. నేను ప్రభుత్వ ఉద్యోగం చేయాలని నాన్న ఆశపడేవారు. ఆయన కోరిక నెరవేర్చినందుకు సంతోషంగా ఉన్నది. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని అందరూ చెప్తుండటం గర్వంగా ఉన్నది. నసీమ్ బేగం, హైదరాబాద్