హైదరాబాద్, జనవరి19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ.. ప్రపంచ పర్యాటకుల స్వర్గధామమని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో గురువారం నిర్వహించిన ప్రపంచ ట్రావెల్, టూరిజం మీట్లో ఆయన తెలంగాణ పర్యాటక వైభవాన్ని ఎలుగెత్తి చాటారు. పర్యాటకరంగ అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. సహజమైన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు అని, మెడికల్ టూరిజానికి హబ్‌గా, టెంపుల్ టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో బుద్ధవనం ప్రాజెక్టును అభివృద్ధి చేసి బుద్ధిజానికి పూర్వవైభవం తీసుకొస్తున్నామని, హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, తెలంగాణలోని రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని తీర్చిదిద్దామని, ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం అని వివరించారు. కార్యక్రమంలో కేంద్ర టూరిజం అడిషనల్ సెక్రటరీ రాకేశ్‌వర్మ, డిప్యూటీ సెక్రటరీ రాకేశ్ థామస్, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టూరిజం ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.