హైదరాబాద్, జనవరి 25 : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ పర్యాటక అద్భుతంగా మారిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. జాతీ య పర్యాటక దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పరాయి పాలనలో 70 ఏండ్లపాటు రాష్ట్ర పర్యాటక ప్రదేశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. సీఎం కేసీఆర్ విజన్‌తో కొద్దికాలంలోనే తెలంగాణ పర్యాటక ప్రదేశాలు రెండు అంతర్జాతీయస్థాయి గుర్తింపులను సొంతం చేసుకున్నాయని పేర్కొన్నారు. రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు సాధిస్తే, భూదాన్ పోచంపల్లి ప్రపంచ అత్యుత్తమ పర్యాటక గ్రామంగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో క్రీడాపాలసీ మాదిరిగానే అత్యుత్తమ టూరిజం పాలసీని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ రూ.1,400 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దారని, శంషాబాద్‌లో చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో రామనుజాచార్య భారీ విగ్రహ నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు.